బీజేపీ ఎత్తులు.. చిత్త‌యిపోతున్న అన్నాడీఎంకే..!

Update: 2021-03-09 12:30 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ద‌శాబ్దాల పాటు చ‌క్రం తిప్పిన పుర‌చ్చి త‌లైవి జ‌య‌ల‌లిత‌.. క‌లైంజ‌ర్ క‌రుణానిధి ఇప్పుడు లేరు. వాళ్లు ఉన్నంత కాలం ద్ర‌విడ సంస్థానంలో జాతీయ పార్టీలు స‌రైన రీతిలో పాదం మోప‌లేక‌పోయాయి. దీంతో.. వారు లేని ఈ సంధి కాలాన్ని వినియోగించుకోవాల‌ని చూస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ అటుంచితే.. త‌మిళ‌నాట పాతుకుపోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని బీజేపీ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇందులో భాగంగానే అన్నా డీఎంకేను ఇన్నాళ్లూ వెన‌కుండి న‌డిపించిన ఆ పార్టీ.. ఇప్పుడు ఎన్నిక‌లు రావ‌డంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో పాగా వేయాల‌ని చూస్తోంది.

వాస్త‌వంగా చూసిన‌ప్పుడు త‌మిళ‌నాడులో బీజేపీ బ‌లం నామ‌మాత్ర‌మే. అన్నా డీఎంకే అధికార పార్టీగా ఉంది. ఇప్పుడు జ‌య‌ల‌లిత ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేది. ఆమె లేక‌పోవ‌డంతో అన్నాడీఎంకేను బీజేపీ అజ‌మాయిషీ చేస్తోంద‌నే చ‌ర్చ సాగుతోంది. అన్నా డీఎంకేతో పొత్తు అనేది పేరుకు మాత్ర‌మేన‌ని, నిర్ణ‌యాల‌న్నీ బీజేపీ చెప్పిన‌ట్టుగానే జ‌రుగుతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఏయే స్థానాల్లో ఎవ‌రు పోటీచేయాలి? ఎన్ని స్థానాల్లో నిల‌బ‌డాలి అన్న‌ది కూడా బీజేపీనే డిసైడ్ చేస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలో పొత్తుపేరిట బ‌ల‌మైన స్థానాల‌ను, కావాల్సిన‌న్ని సీట్ల‌ను ఏక‌ప‌క్షంగా తీసుకుంటోంద‌ని త‌మిళ‌నాట చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఈ కార‌ణంగానే.. పొత్తులు పొస‌గక ఇప్ప‌టి వ‌ర‌కూ అన్నాడీఎంకేతో జ‌ట్టుక‌ట్టిన పార్టీలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయ‌ట‌.

శ‌ర‌త్ కుమార్ పార్టీ ఆల్ ఇండియా స‌మ‌తువ మ‌క్క‌ల్ క‌ట్చి (ఏఐఎస్ఎంకే) ఈ కార‌ణంగానే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న క‌మ‌ల్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కెప్టెన్ విజ‌య్ కూడా వైదొల‌గ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ట‌. త‌న‌కు 40 సీట్లు ఇవ్వ‌ని ప‌క్షంలో అన్నా డీఎంకేను వీడి.. క‌మ‌ల్ బ్యాచ్ లో చేరిపోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని లీకులు ఇస్తున్నాడ‌ట‌. దీనంత‌టికీ బీజేపీ రాజ‌కీయ‌మే కార‌ణ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విధంగా.. త‌న ఎత్తుల‌తో ప్ర‌త్య‌ర్థులకు బ‌దులు.. మిత్ర ప‌క్ష‌మే దెబ్బ‌తింటోందంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి, ఎన్నిక‌ల నాటికి పొత్తులు ఏ రూపం తీసుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News