కుడివైపు ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎడ‌మ వైపు జూనియ‌ర్ అంతేనా?

Update: 2022-09-05 09:31 GMT
తెలుగు రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) విల‌క్ష‌ణ రాజ‌కీయాలు చేస్తోందా అంటే అవుననే అంటున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన పార్టీతో పొత్తులో ఉంది.. బీజేపీ. త‌ద్వారా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను త‌మ కుడి భుజంగా మార్చుకునే ఆలోచ‌న‌లో ఉంది. ఇప్పుడు మ‌రింత మంది న‌టుల‌ను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంత‌నాలు జ‌రిపారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ న‌ట‌నను మెచ్చుకోవడానికే అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను పిలిపించార‌ని వార్త‌లు వ‌చ్చినా.. అస‌లు కార‌ణం మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బీజేపీలోకి ఆహ్వానించ‌డ‌మేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. త‌ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కుడి భుజంగా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఎడ‌మ భుజంగా మార్చుకుని తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను శాసించాల‌నేది బీజేపీ ప్లాన్ అని చెబుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపు సామాజిక‌వ‌ర్గానికి బీజేపీ పెద్ద‌పీట వేస్తోంది. ప్ర‌స్తుత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు కాపు సామాజిక‌వ‌ర్గానికి తోడు క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి మంచి ఇమేజ్, పేరు ప్ర‌తిష్ట‌లు ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ను లాగాల‌ని బీజేపీ నిశ్చ‌యించుకుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. సుజ‌నా చౌద‌రి వంటివారు కూడా బీజేపీలోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో భారీగా అభిమానులు ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ను కూడా త‌మ పార్టీ వైపు లాగితే ప‌వ‌న్ క‌ల్యాణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌ను ఉప‌యోగించుకుని బీజేపీ బ‌ల‌ప‌డాల‌నేది ప్లాన్ అని చెబుతున్నారు.

అయితే బీజేపీ కంటే టీడీపీతో పొత్తుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ మొగ్గుచూపుతున్నార‌ని అంటున్నారు. వైఎస్సార్సీపీని మ‌ళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలంటే కేవ‌లం బీజేపీతో పొత్తు స‌రిపోద‌నేది ప‌వ‌న్ క‌ల్యాణ్ భావ‌న అని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ అల‌య‌న్స్ ఉండాల‌నేది ప‌వ‌న్ యోచ‌న అని అంటున్నారు. బీజేపీ ఇందుకు అంగీక‌రించ‌క‌పోతే ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని పేర్కొంటున్నారు.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇప్ప‌ట్లో అంటే 2024 ఎన్నిక‌ల‌కు కూడా రాజ‌కీయాల వైపు తొంగి చూసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎద‌గ‌డ‌మే జూనియ‌ర్ ఎన్టీఆర్ టార్గెట్ అని చెబుతున్నారు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌య‌సు 39 ఏళ్లు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌కు 41 ఏళ్ల వ‌స్తాయి. ఇక 2029 నాటికి 46 ఏళ్ల‌కు జూనియ‌ర్ చేర‌తారు. అప్పటికి చంద్ర‌బాబు నాయుడికి 79 ఏళ్లు వ‌స్తాయి. అప్ప‌టికి ఆయ‌న అంత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేర‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏనాటికైనా టీడీపీ పగ్గాలు చేప‌ట్టాల్సింది తానేన‌ని భావిస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ బీజేపీలో చేర‌బోర‌ని చెబుతున్నారు. బీజేపీలో చేరి త‌న భ‌విష్య‌త్‌కు తానే గొయ్యి త‌వ్వుకోర‌ని అంటున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం త‌న పార్టీ ప్ర‌యోజ‌నాలు చూసుకుంటారు తప్ప బీజేపీని ఎద‌గ‌డానికి సాయం చేయ‌బోర‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ల‌ను ఉప‌యోగించుకుని బీజేపీ ఎద‌గాల‌నుకోవ‌డం లేదా అధికారంలోకి రావాల‌నుకోవ‌డం అత్యాశేన‌ని పేర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News