టీ లో కామెడీ : సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్

Update: 2018-01-04 08:17 GMT
తెలంగాణ రాజకీయాల్లో చిన్న ప్రహసనం నడుస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన సంవత్సరాది రోజున.. అన్నదాతలకు ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా 24 గంటలపాటూ సరఫరాచేసే పథకాన్ని ప్రారంభించేశారు. ఖచ్చితంగా అన్నదాతల్లో ఈ పథకం ఆయనకు చాలా కీర్తిప్రతిష్టలను తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. అయితే.. ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం ప్రారంభించడంతో.. ప్రతిపక్షాలు పూర్తిగా ఉడికిపోతున్నాయి. కేసీఆర్ కు కీర్తి దక్కుతుందంటే సహించలేకపోతున్నాయి. దానికి సంబంధించిన క్రెడిట్ లో తమకు కూడా వాటా ఉందంటే.. తమకు వాటా ఉందంటూ.. ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. ఆ క్రెడిట్ తమదే అని.. ప్రతిపక్షాలు అన్నీ డప్పు కొట్టుకోవడం చూసినప్పుడు.. వాళ్లందరూ వాటాల కోసం ఎగబడేంత గొప్ప పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారా... అని జనం మరింతగా ఆదరించే పరిస్థితి ఏర్పడుతోంది.

తెలంగాణ లో కేసీఆర్ ప్రారంభించిన నిరంతరాయ విద్యుత్తు పథకం.. నిస్సందేహంగా మంచి ఆలోచనే. అందుకే ఆయనను ప్రత్యేకంగా అభినందించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే రోజు సాయంత్రం ప్రగతి భవన్ కు వచ్చి కలిసి వెళ్లారు. దేశంలోనే ఇలాంటి ఘనతను మొట్ట మొదటగా తెలంగాణ సాధించింది. ఎక్కడో రాజస్థాన్ లో ఉన్న దినపత్రిక కూడా ఈ పథకాన్ని బహుధా ప్రశంసిస్తూ సంపాదకీయ కథనాలను ప్రచురించింది. అంతగా దీనికి ఆదరణ లభించింది. దీన్ని చూసి తెలంగాణలోని విపక్షాలు మాత్రం ఓర్వలేకపోతున్నాయి.

ఇవాళ తెలంగాణ విద్యుత్తులో మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిందంటే దాని అర్థం.. తమ పాలనలో ఏర్పాటుచేసిన విద్యుత్తు ప్రాజెక్టుల ఫలితమే అని.. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ డప్పు కొట్టుకుంటోంది. మా ప్రాజెక్టుల పుణ్యమాని కేసీఆర్ నిరంతర విద్యుత్తు ఇవ్వగలుగుతున్నారని అంటోంది. ఇంతకూ వారెందుకు ఇవ్వలేకపోయారో మాత్రం చెప్పడం లేదు.

అలాగే ఇవాళ ఈ క్రెడిట్ రేసులోకి భాజపా కూడా ఎంట్రీ ఇచ్చింది. కేంద్రం చలవ వల్లనే తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆవిర్భవించిందని - నిరంతరాయ విద్యుత్తు ఇస్తున్నారంటే మోడీ పుణ్యమే అని భాజపా రాష్ట్ర సారథి లక్ష్మణ్ తన సొంత భాష్యం చెబుతున్నారు.

ఆ క్రెడిట్ కోసం అంత మంది ఆరాటపడడం చూసి జనం నవ్వకుంటున్నారు. ‘‘సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ ’’ అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. ఒక ఘనకార్యం జరిగిందంటే.. అది నావల్లే .. నా వల్లే అని చాటుకోవడానికి చాలా మందే పోటీపడుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి కూడా ఆ సామెత చందంగానే ఉన్నదని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News