జనసేన నంబర్ వన్ అంటున్న బీజేపీ ...?

Update: 2022-04-27 11:33 GMT
చెబితే తమ పార్టీ గురించి చెప్పుకోవాలి.  గొప్పలు అయినా పొగడ్తలు అయినా  తమ పార్టీకి ఉపయోగపడేలా చేసుకోవాలి. కానీ ఏపీలో బీజేపీ నేతలు మాత్రం మిత్ర పక్షం మీద మితిమీరి  మమకారం చూపిస్తున్నారు. అది కాస్తా మోతాదు ఎక్కువై జనసేన నంబర్ వన్ అనేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేసుకోవాలని ఉత్తరాంధ్రా స్థాయిలో పార్టీ సమావేశాన్ని విశాఖలో  బీజేపీ నిర్వహించింది.

దానికి ముఖ్య అతిధిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ కన్నా జనసేనకు ఎక్కువ ఓట్లు వస్తాయి. ఏపీలో నంబర్ వన్ పొజిషన్ లో ఉండేది జనసేన మాత్రమే అని సంచలన కామెంట్స్ చేశారు. నిజానికి బీజేపీకి జనసేన మిత్ర పక్షంగా ఉంది.

అయితే ఈ మధ్య రెండు పార్టీల మధ్యన పొత్తు అంత సక్రమంగా లేదు. ఎవరి కార్యక్రమాలు వారివి అన్నట్లుగా సీన్ ఉంది. ఈ నేపధ్యంలో పురంధేశ్వరి జనసేనను పొగడడం అంటే అది విశేషంగానే చూడాలి అంటున్నారు.

జనసేనకు జనాదరణ ఉందని బీజేపీ నేత చెప్పడమే ఇక్కడ తమాషా. నిజానికి ఆ పని ఆ పార్టీ వారు చేసుకోవాలి, వారు అలా సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు కూడా. కానీ పురంధేశ్వరి బీజేపీ బలోపేతం గురించి మాట్లాడకుండా జనసేనకే ఏపీలో అన్ని పార్టీల  కన్నా  ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పడం ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న.

అంటే తమ మిత్రుడుని గట్టిగా పొగడడం ద్వారా పొత్తుని మరింతగా బలోపేతం చేసుకోవచ్చు  అన్న ఎత్తుగడతో ఇలా వ్యాఖ్యానించారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి వెళ్ళాలని జనసేన చూస్తోందని ఒక వైపు ప్రచారం సాగుతూంటే బీజేపీ జనసేన కూటమిని పటిష్టం చేస్తామని కాషాయదారులు మరో వైపు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే చిన్నమ్మ చేసిన ఈ కామెంట్స్ ఆలోచింప చేసేవిగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి ఏపీలో ఈసారి ఎక్కువ ఓట్లు వస్తాయా లేదా అది కూడా పురంధేశ్వరి చెబితే బాగుంటుందని సగటు కాషాయం కార్యకర్తలు కోరుకోవడంలో తప్పు లేదు కదా.
Tags:    

Similar News