బీజేపీ ఎంపీ టికెట్‌ కు 16 'క‌మాండ్ మెంట్స్‌'

Update: 2017-12-22 08:16 GMT
తాజాగా వెల్ల‌డైన రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ప‌లితాలు క‌మ‌ల‌నాథుల్లో స‌మ‌రోత్సాహాన్ని మ‌రింత‌గా పెంచేశాయి. 22 ఏళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త త‌మ‌ను ఓడించ‌కుండా చేయ‌టంలో స‌క్సెస్ కావ‌టం.. మ‌రో ఐదేళ్ల పాటు ప‌వ‌ర్ లో ఉండేలా చేసుకోవ‌టంపై సంతోషం వెల్లివిరుస్తోంది.

రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో అనుస‌రించిన వ్యూహం స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో.. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఘ‌న విజ‌యం సాధించేందుకు వీలుగా ఇప్ప‌టినుంచే హోంవ‌ర్క్ మొద‌లు పెట్టాల‌ని మోడీ అండ్ కో భావిస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తును మొద‌లెట్టింది.

పార్టీ ఎంపీల ప‌ని తీరును స‌రైన ప‌ద్ధ‌తిలో మ‌దింపు చేయ‌టం.. ఇందుకు సంబంధించిన చెక్ పాయింట్స్ ఏం ఉండాల‌న్న అంశంపై తాజాగా పార్టీ ఫోక‌స్ చేసింది. పార్టీలో సీనియార్టీ.. పేరు ప్ర‌ఖ్యాతుల్ని ప‌క్క‌న పెట్టి.. గెలుపు మాత్ర‌మే అంతిమ లక్ష్యంగా టికెట్ల ఎంపిక ఉండాలే త‌ప్పించి.. మ‌రింకేమీ ప్రామాణికం కాద‌న్న రీతిలో ఎంపిక ఉండాల‌ని భావిస్తోన్న‌ట్లుగా తెలుస్తోంది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ 282 మంది ఎంపీల్ని స్వ‌యంగా గెలిపించుకుంది. ఈ నేప‌థ్యంలో త‌మ ఎంపీల బ‌లంపైన దృష్టి సారించింది. ఎంపీల ప‌నితీరును మ‌దింపు చేసేందుకు ఓ ఏజెన్సీకి బాధ్య‌త‌ల్నిఅప్ప‌గించింది. ఎంపీల ప‌నితీరుపై ఏజెన్సీ ఇచ్చే రిపోర్ట్‌ ను ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌రిశీలించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ మదింపు ప్ర‌క్రియ‌ను వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌న్న లక్ష్యాన్ని పెట్టుకున్న‌ట్లుగా చెబుతున్నారు. పార్ల‌మెంటుకు ఎంపీల హాజ‌రు.. చ‌ర్చ‌ల్లో వారెంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌తో ఎంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి? స‌మ‌స్య‌ల ప‌ట్ల వారి స్పంద‌న ఏమిటి? ఇలా 16 అంశాల మీద వారు దృష్టి సారిస్తారు. వీటిల్లో మెరుగైన ప‌ని తీరు ఉన్న వారికి మాత్ర‌మే 2019 లో జ‌రిగే ఎన్నిక‌ల్లో టికెట్లు వ‌స్తాయే త‌ప్పించి.. ఈ నివేదిక‌లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా టికెట్ ఇచ్చే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది.

సిట్టింగ్ ఎంపీల ప‌నితీరు.. ప్ర‌జ‌ల్లో వారికున్న ఆద‌ర‌ణను లెక్కించి.. ఎన్నిక‌ల్లో వారికున్న విజ‌య‌వ‌కాశాల్ని మ‌దింపు చేసిన త‌ర్వాత మాత్ర‌మే టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేస్తారే త‌ప్పించి ఎలాంటి రిక‌మెండేష‌న్స్‌కు అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. 16 అంశాల్లో  మంచి మార్కులు వ‌చ్చిన వారికి మాత్ర‌మే టికెట్లు అని.. లేకుంటే సిట్టింగ్‌ లకు హ్యాండ్ ఇస్తార‌ని తెలుస్తోంది. భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టానికి.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించ‌టానికి ఈ మాత్రం హోంవ‌ర్క్ లేకుండా విజ‌యం సాధ్యం కాదు క‌దా?
Tags:    

Similar News