ఆ సీఎంకు సినిమా షురూ అయినట్లే

Update: 2016-08-09 05:51 GMT
దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుర్కోని చిత్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే కేంద్రంతో నిత్యం ఏదో ఒక పంచాయితీ నడిచే పరిస్థితి. ఇది చాలదన్నట్లు ఈ మధ్యనే ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు ఒకటి ఆ రాష్ట్ర సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర సర్కారుకే ఎక్కువ అధికారాలు ఉండాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించటం.. ఈ ఉదంతంలో ఆయన వాదనకు విరుద్ధంగా హైకోర్టు నిర్ణయంతీసుకోవటం.. దేశ రాజధానికి పరిపాలనా అధినేతగా ఉన్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయాల్లో సూచనలు చేసే అధికారం ఉందంటూకోర్టు స్పష్టం చేయటం తెలిసిందే.

ఈ తీర్పును తప్పు పడుతున్న ఢిల్లీ రాష్ట్ర సర్కారు.. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్న తీసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ నుంచి వచ్చిన ఒక ఆదేశం ఢిల్లీ రాష్ట్ర సర్కారుకు.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు మధ్య మరింత దూరాన్ని పెంచేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల వెలువడిన ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర సర్కారు తీసుకునే నిర్ణయాల్ని తాను పరిశీలిస్తానని.. ఇందులో భాగంగా ఆప్ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తీసుకురావాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ జంగ్ ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. అధికారుల బదిలీలు.. అపాయింట్ మెంట్లకు సంబంధించిన ఫైళ్లను మంత్రులకు కాకుండా తనకే నేరుగా పంపాలంటూ ఆయన స్పష్టం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తమకున్న అధికారాల్లో కోత పడిందని కిందామీదా పడే కేజ్రీవాల్ సర్కారుకు.. కోర్టు తీర్పునేపథ్యంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ చెలరేగిపోతున్న తీరు మరింత ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్రంతో పలు అంశాల్లో పోరాడుతున్న కేజ్రీవాల్ సర్కారుకు.. తాజాగా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నిర్ణయాలతో ఆయనకు నిత్యం సినిమానే అన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News