బెంగాల్ బీజేపీకి దెబ్బ ప‌డుతుందా?

Update: 2022-01-08 02:30 GMT
ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ట్టు సాధిద్దామ‌నుకున్న బీజేపీకి గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌త బెన‌ర్జీ గ‌ట్టి షాక్ నిచ్చారు. ఆ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో మూడోసారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తాను ఓడిపోయినా పార్టీని గెలిపించుకున్నారు. ఆ త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యం సాధించారు. మ‌మ‌త గెలుపుతో అక్క‌డ పాగా వేసేందుకు మోడీషా ద్వ‌యం ఎన్ని ఎత్తులు వేసినా ఫ‌లితం లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలోకి వెళ్లిన తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు ఒక్కొక్క‌రికి తిరిగి సొంత‌గూటికి చేరుకుంటున్నారు. మ‌రోవైపు బీజేపీ నుంచి పెద్ద సంఖ్య‌లోనే నేత‌లు మ‌మ‌త ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో బీజేపీని ఖాళీ చేయ‌డంపై ఆమె దృష్టి పెట్టార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ సీట్లు గెల‌వ‌డంలో మ‌తువా సామాజిక వ‌ర్గం కీల‌క పాత్ర పోషించింది. కానీ ఇప్పుడా వ‌ర్గం నేత‌లు బీజేపీపై గుర్రుగా ఉన్న‌ట్లు తెలిసింది. త‌మ‌కు పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పించ‌డం లేద‌ని వాళ్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా మ‌తువా సామాజిక వ‌ర్గానికి చెందిన కేంద్ర నౌకాయాన‌, జ‌ల‌మార్గం, పోర్టుల శాఖ మంత్రి సంతను ఠాకూర్ బీజేపీపై త‌న అసంతృప్తిని ప‌రోక్షంగా బ‌య‌ట‌పెట్టారు. బెంగాల్ బీజేపీకి చెందిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. దీంతో బాన్‌గావ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంత‌ను ఠాకూర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సంత‌ను ఠాకూర్ మ‌తువా సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడే కాకుండా అఖిల భార‌త మ‌తువా మ‌హా సంఘానికి నాయ‌కుడు కూడా. అలాంటి నేత ఇప్పుడు రాష్ట్ర బీజేపీకి చెందిన వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పటికే ఆ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆ గ్రూపుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లో ఆ వ‌ర్గం మెజార్టీగా ఉన్న‌ప్ప‌టికీ క‌నీసం జిల్లా స్థాయి పోస్టులు కూడా వాళ్ల‌కు ద‌క్క‌లేద‌ని తెలిసింది. ఇక బీజేపీని దెబ్బ తీసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే మ‌మ‌త ఈ అవ‌కాశాన్ని అందుకోవాల‌ని చూస్తున్నార‌ని స‌మాచారం. అందుకే మ‌తువా సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను త‌మ పార్టీలోకి తృణ‌మూల్ కాంగ్రెస్ ఆహ్వానించింద‌ని తెలిసింది. ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఒక‌వేళ మ‌మ‌త ఆహ్వానాన్ని మ‌న్నించి ఆ వ‌ర్గం నాయ‌కులు తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరితే బీజేపీకి గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌డం ఖాయం.
Tags:    

Similar News