మ‌మ‌త‌ను మ‌రోసారి ఓడించడ‌మే బీజేపీ టార్గెట్!

Update: 2021-09-22 07:33 GMT
ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌గా ఎన్నిక‌య్యే ప‌నిలో ప‌డ్డారు. ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసినా, భారీ మెజారిటీని సాధించినా, మ‌మ‌త మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయారు! మ‌మ‌త‌పై బీజేపీ అభ్య‌ర్థిగా సువేందు అధికారి విజ‌యం సాధించారు. అలా ప్ర‌తిష్టాత్మ‌క పోరులో బీజేపీ నెగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినా, మ‌మ‌త‌పై విజ‌యం బీజేపీకి కొంత ఊర‌ట‌ను ఇచ్చింది.

ఇక మ‌మ‌త కోసం ఉప ఎన్నిక వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదా లేకుండా ఆరు నెల‌లు మాత్ర‌మ కొన‌సాగే అవ‌కాశం ఉండ‌టంతో, మమ‌త ఉప ఎన్నిక‌ల్లో నెగ్గి తీరాల్సి ఉంది. మ‌మ‌త‌కు ఊర‌ట ఏమిటంటే, ఆమె ప‌ద‌వీ కాలం ఆరు నెల‌లు పూర్తి గాక ముందే ఉప ఎన్నిక‌కు ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెస్ట్ బెంగాల్ లో నెల‌కొన్న రాజ్యాంగ ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా అక్క‌డ క‌రోనా ప‌రిస్థితుల్లో కూడా ఉప ఎన్నిక ను నిర్వ‌హిస్తున్న‌ట్టుగా సీఈసీ పేర్కొంది. మిగ‌తా దేశమంతా ఉప ఎన్నిక‌ల‌ను సీఈసీ కొంత కాలం వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ ప‌రిస్థితుల్లో భ‌వానీ పూర్ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. అక్క‌డ మ‌మ‌త పోటీ చేస్తూ ఉన్నారు. ఆమెపై బీజేపీ అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో సువేంద్ అధికారి స్పందిస్తూ.. మ‌మ‌త‌ను మ‌రోసారి ఓడించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మంటూ ప్ర‌క‌టించుకున్నారు. త‌మ‌కు ఇప్పుడు మ‌రో టార్గెట్ లేద‌ని ఆయ‌న అంటున్నారు.

అయితే అది అంత తేలికైన అంశం ఏమీ కాదు. భ‌వానీ పూర్ లో టీఎంసీకి గ‌ట్టి ట్రాక్ రికార్డు ఉంది. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెగ్గ‌డ‌మే కాదు, అంత‌కు ముందు కూడా అక్క‌డ టీఎంసీదే హ‌వా. స్వ‌యంగా మ‌మ‌తా బెన‌ర్జీ కూడా గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నెగ్గారు. అక్క‌డ నుంచి వెళ్లి మ‌రో చోట పోటీ చేసే ఆమె ఓడిపోయారు. ఒక‌ర‌కంగా ఇది మ‌మ‌త‌కు కంచుకోట‌. అలాంటి చోట ఆమెను ఓడించ‌డం బీజేపీకి తేలికేమీ కాదు. అయితే వ‌ర‌స‌గా రెండోసారి ఆమెను బీజేపీ ఓడిస్తే మాత్రం.. సీఎం సీట్లో కొన‌సాగ‌డానికి ఆమె కాస్త ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. కానీ, భ‌వానీ పూర్ గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే మాత్రం మ‌మ‌త విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే!


Tags:    

Similar News