ఏపీ కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహం

Update: 2019-06-17 08:14 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో బలపడేందుకు బీజేపీ పక్కా వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. తెలంగాణ మాదిరిగా 2024 టార్గెట్ పెట్టుకోకుండా 2029ని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. మిషన్ ఇప్పటి నుంచే మొదలుపెడుతున్నారు. అందులోభాగంగా ప్రస్తుతం బలహీనపడిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరిచి తాము ఎదగాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఆ క్రమంలో ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీని కూడా వాడుకోనున్నట్లు సమాచారం.

టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటూ తొలుత వారు రాజీనామా చేసి రావాలని జగన్ క్లియర్‌ గా చెబుతున్నారు. అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇప్పుడు పోటీ చేస్తే గెలవడం కష్టమన్న భయంతో చాలామంది అందుకు వెనుకాడుతున్నారు. అదేసమయంలో టీడీపీలో కొనసాగి లాభం లేదనే ఉద్దేశంలోనూ ఉన్నారు. జగన్ నిర్ణయం కారణంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకునే ఉద్దేశంలో ఉంది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు - ఎంపీలు వీలైనంత మందిని బీజేపీలోకి తీసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ నేతలను వైసీపీలోకి పంపించాలనుకుంటోందట. ముఖ్యంగా ఎంపీలు - ఎంపీ స్థాయి నేతలను.. జిల్లాలను ప్రభావితం చేయగల నేతలను బీజేపీ ఎంచుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ ఇందుకోసం జిల్లాలు - నియోజకవర్గాలవారీగా లిస్టు తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే నిజమైతే టీడీపీ నుంచి గెలిచి పక్క చూపులు చూస్తున్నవారంతా బీజేపీలోకి... ఓటమి పాలైనవారు - మాజీలు అంతా వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు పార్టీల్లో దేంట్లోకి వెళ్లినా కూడా ఆయా పార్టీలు వారిని మంచి పదవులతో ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఆ తరువాత చేరికలకు ఆయన్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక టీడీపీని ఖాళీ చేసే పని మొదలవుతుందని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.


Tags:    

Similar News