కమలం వేట : కొండా విశ్వేశ్వరరెడ్డితో స్టార్ట్

Update: 2022-06-29 12:30 GMT
తెలంగాణాను ఈసారి ఎలాగైనా కొట్టాలన్న కసితో బీజేపీ ఇపుడు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నది బీజేపీ ఆలోచన‌గా ఉంది. అందుకే ఏకంగా బీజేపీ పార్టీ మొత్తం జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దిగిపోతోంది. ఏకంగా నాలుగైదు రోజుల పాటు ఆ సందడి సాగనుంది. ఇవన్నీ పక్కన పెడితే పది లక్షల‌ మంది కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ సభను నిర్వహించాలని బీజేపీ చూస్తోంది.

అంత పెద్ద సభలో చేరికలు లేకుంటే ఎలా. బీజేపీ బలం పెరిగింది అని చెప్పుకోవడానికి ఈ చేరికలు ఉపయోగపడతాయి. దానికోసం కమలం వేట మొదలెట్టింది. వరసబెట్టి చాలా మంది నాయకలను టార్గెట్ చేసుకుంటూ పోతోంది. ఇక టీయారెస్ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ చేర్చుకుంది. ఆయన చాలా కాలంగా సరైన పార్టీ కోసం వెతుకులాటలో ఉన్నారు.

ఆయన కాంగ్రెస్ లో చేరి కూడా బయటకు వచ్చారు. నిజానికి మాజీ మంత్రి ఈటెల రాజెందర్ తో పాటే ఆయన బీజేపీలో చేరాలి. కానీ ఇపుడు ఆ టైమ్ వచ్చినట్లుంది. జూలై 1న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో కొండా పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు. ఆయనది ఘనమైన రాజకీయ కుటుంబం. ఆయన తాత కేవీ రంగారెడ్డి డిప్యూటీ సీఎం గా గతంలో పనిచేశారు.

అలాగే ఆయన తెలంగాణా ఉద్యమం చేసి రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. ఇక విశ్వేశ్వరరెడ్డి పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు  అమెరికా  పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ కావడాన్ని గొప్పగా చెప్పుకుంటారు.

అలాగే చూస్తే  అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్‌ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య. ఇలా ఒక వైపు చూస్తే బిగ్ షాట్. మరో వైపు తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన కుటుంబం, ఇంకో వైపు విశ్వేశ్వరరెడ్డి కూడా దూకుడు రాజకీయ నేత కావడం బీజేపీకి ప్లస్ అయ్యే చాన్స్ ఉంది.

ఇంకో వైపు చూస్తే వివిధ పార్టీలలోని చాలా మంది అసంతృప్త నేతలకు బీజేపీ గేలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్, అధికార టీయారెస్ నేతలు ఉన్నారని అంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ లో జరిగే  మోడీ సభను కొత్త వారి చేరికలతో కళకళలాడించాలని బీజేపీ నేతలు చూస్తున్నారు.
Tags:    

Similar News