గుజరాత్ ఎన్నికల తరువాత షాకివ్వనున్న బీజేపీ

Update: 2017-12-10 08:35 GMT
దేశంలో రాజకీయ పరిస్థితులును బీజేపీకి అనుకూలంగా చేసుకుంటూ వెళ్లడంతో నిత్యం కొత్తకొత్త వ్యూహాలతో సమర్థంగా సాగిపోతున్న ద్వయం ప్రధాని మోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఇద్దరూ తమ దృష్టంతా సొంత రాష్ర్టం గుజరాత్ పై పెట్టారు. ఇద్దరికీ అదే సొంత రాష్ట్రం కావడం - అక్కడ ఎన్నికలు జరుగుతుండడంతో ఫోకస్ మొత్తం అక్కడే ఉంది. ఈ ఇద్దరూ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్న సమయంలో ఏపీలోని మిత్రపక్ష నేత చంద్రబాబు, ఆయనకు అనుకూలుడని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఇద్దరూ కేంద్రంపై - బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రంతో కయ్యానికి దిగగా - పవన్ ఏపీలో పర్యటిస్తూ బీజేపీ పెద్దలపై - ఆ పార్టీకి కేంద్రమంత్రులు - ఎంపీలపైనా విమర్శలు కురిపిస్తున్నారు. అయితే... గుజరాత్ ఎన్నికల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మోదీ - అమిత్ షాలు ఈ విషయం గమనిస్తూనే ఉన్నారని... ఏపీలో చంద్రబాబు - పవన్ ముసుగు రాజకీయాలను గమనిస్తున్నారని బీజేపీ నేతల నుంచి వినిపిస్తోంది. గుజరాత్ ఎన్నికలు కాగా ఏపీపై దృష్టి పెట్టి ఇక్కడ ఏం చేయాలన్నది నిర్ణయిస్తారని చెప్తున్నారు.
    
గత ఎన్నికల కంటే బీజేపీ దేశవ్యాప్తంగా బలపడిన నేపథ్యంలో - మోదీ మరింత బలవంతుడైన నేపథ్యంలో... చంద్రబాబును పట్టించుకోని నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మధ్య బంధం వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అన్న అనుమానం అందరిలోనూ ఉంది. మరోవైపు పొత్తుల గురించి చంద్రబాబు కూడా పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చినట్లు చెప్తున్నారు. బీజేపీని వదిలించుకోవాలని... అమరావతి పనులు ఊపందుకోకపోవడానికి, పోలవరం పూర్తికాకపోవడానికి కేంద్రమే కారణమని నింద బీజేపీపై వేసి బయటకొచ్చేసి పవన్ జనసేనతో కలిసి కాపుల ఓట్లు అండగా ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
    
తాను అడిగినన్ని నిధులివ్వకపోవడం.. ఎంత వేడుకున్నా సీట్లు పెంచకపోవడంతో చంద్రబాబు మోదీపై అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెప్తున్నారు. పైగా ఈసారి పొత్తు ఉంటే బీజేపీ సీట్లు కూడా ఎక్కువ అడుగుతుందని అనుకుంటున్నారు. దీంతో బీజేపీని పక్కన పెట్టి పవన్‌ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లానుగా తెలుస్తోంది. అయితే.. ఏపీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకుని తమ అధిష్టానానికి చేరవేయగా గుజరాత్ ఎన్నికలు తర్వాత చూద్దామని అధిష్ఠానం సిగ్నలిచ్చినట్లు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News