బీజేపీకి టీడీపీ వెన్నుపోటు పొడిచేసిన‌ట్లేనా?

Update: 2017-08-17 09:17 GMT
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు త‌న మిత్ర‌ప‌క్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డిన బీజేపీకి గ‌ట్టి వెన్నుపోటు పొడిచార‌ని ఇప్పుడు భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు బాబు అంటే సౌమ్యుడ‌ని, స్నేహానికి విలువ ఇస్తాడ‌ని భావించిన బీజేపీ నేత‌లు... ఇప్పుడు  బాబు వెన్నుపోటు దెబ్బ‌కు విల‌విల్లాడిపోతున్నారట‌. అయినా ఇప్పుడు ఈ కొత్త విష‌యం ఎందుకు వ‌చ్చిందంటే.... తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో దాదాపు ఏడేళ్ల త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. అటు రాష్ట్రంలోనే కాకుండా ఇటు కేంద్రంలోనూ మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు క‌లిసిక‌ట్టుగానే ఈ ఎన్నిక‌ల్లో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాయ‌ట‌.

ఇక్క‌డి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాల‌కు ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ, టీడీపీలు రెండూ మ‌రోసారి కూడా క‌లిసే పోటీ చేయాల‌ని భావించాయి. దీంతో మొత్తం 48 వార్డుల్లో ఎవ‌రెవ‌రు ఎన్ని సీట్లు పంచుకోవాల‌నే విష‌యంపై చ‌ర్చించుకుని ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.  ఈ క్ర‌మంలోనే టీడీపీ నైజం బీజేపీకి తెలిసొచ్చింద‌ట‌. టీడీపీ తన‌కు పట్టులేని డివిజన్లను బీజేపీకి కేటాయించింది. ఆ తర్వాత ప్లేటు తిప్పేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 9 డివిజన్లలో మూడింట తమ నాయకులనే రెబల్స్‌గా బరిలోకి దించేసింద‌ట‌. టీడీపీ తీరుతో ఖిన్నులైన బీజేపీ నాయకులు ఏం చేయాలో పాలుపోక అయోమ‌యంలో కూరుకుపోయార‌ట‌. 

ప్ర‌స్తుతం టీడీపీ మొత్తం 39 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బరిలోకి దింపింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. అయితే మిత్రపక్షాల ఒప్పందం ప్రకారం బీజేపీకి కేటాయించిన 9 - 35 - 47 డివిజన్లలో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు మాత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. టీడీపీ నేత‌లు నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులందరితో ముందుగానే నామినేషన్ల ఉపసంహరణ పత్రాల మీద సంతకాలు చేయించుకొని తమ వద్ద ఉంచుకున్నారు. అయితే ఈ డివిజన్లలోని టీడీపీ అభ్యర్థుల నుంచి మాత్రం నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకోలేదట‌.  ఇలా.. బీజేపీకి మొత్తం వార్డుల కేటాయింపులో అన్యాయం చేసిన టీడీపీ.. అనంత‌రం బీజేపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగిన చోట రెబ‌ల్స్‌ను బరిలోకి దింప‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు . మిత్ర ధ‌ర్మం అంటే ఇదేనా అని కూడా వారు  ప్ర‌శ్నిస్తున్నారు?  మ‌రి దీనికి టీడీపీ సైడ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News