హోదా పోరుకు... కావేరీతో బీజేపీ విరుగుడు మంత్రం!

Update: 2018-03-19 15:30 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం హోరెత్తుతున్న నిర‌స‌న‌ల‌కు బీజేపీ స‌ర్కారు విరుగుడు మంత్రం క‌నిపెట్టిన‌ట్టుగానే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో ఏర్ప‌డ్డ ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటుగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ - ప‌లు జాతీయ విద్యా సంస్థ‌లు - లోటు బ‌డ్జెట్ భ‌ర్తీ చేసేందుకు ప్ర‌త్యేక కేటాయింపులు కేంద్రం చేయాల్సి ఉంది. అయితే అదుగో - ఇదుగో అంటూ బీజేపీ స‌ర్కారు నాన్చుతూనే... ఇక ఏపీకి చేయాల్సింది ఏమీ లేద‌న్న కోణంలో మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో అస‌లు ఏపీ ప్ర‌స్తావ‌న‌నే తీసుకురాని విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మొన్న‌టిదాకా బీజేపీ మాట‌నే ప‌ట్టుకుని వేలాడిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేసుకున్నారు. అయితే మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ దెబ్బ‌కు చంద్ర‌బాబుకు దిమ్మ తిర‌గ‌గా... వైసీపీ పెంచేసి హోదా పోరుతో భ‌య‌ప‌డిపోయిన చంద్ర‌బాబు... త‌న ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో రాజీనామాలు చేయించి ఆ త‌ర్వాత ఎన్డీఏ నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వచ్చేశారు.

ఇక ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర స‌ర్కారుపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌గా... ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయిపోతామ‌న్న భావ‌న‌తో టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో స‌భ‌లో అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్ కు వ‌స్తే... బీజేపీకి పెద్ద దెబ్బేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఎందుకంటే తొలుత వైసీపీ - ఆ త‌ర్వాత టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానాల‌కు చాలా పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికేందుకు సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేశాయి. ఈ క్ర‌మంలో స‌భ‌లో అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రాకుండా ఉండేందుకు బీజేపీ ప‌క్కా స్కెచ్ ర‌చించింద‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా పోరు... దేశంలోని ఉత్త‌రాది - ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న వ్య‌త్యాసాన్ని బాగానే ఎలివేట్ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీ నిర‌స‌న‌లకు చెక్ పెట్టేందుకు ఉత్త‌రాది వ్యూహం మంచిది కాద‌ని భావించిన బీజేపీ... ద‌క్షిణాది రాష్ట్రాల‌తోనే చెక్ పెట్టించేందుకు రంగం సిద్ధం చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇందులో భాగంగానే త‌న చెప్పుచేత‌ల్లోకి వ‌చ్చేసిన త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకేను ఉసిగొల్పిన మోదీ స‌ర్కారు... కావేరీ న‌దీ జలాల వివాదాన్ని తెర‌పైకి తీసుకొచ్చింది. క‌ర్ణాట‌క‌ - తమిళ‌నాడుల మ‌ధ్య కొన‌సాగుతున్న కావేరీ న‌దీ జ‌లాల వివాదానికి సంబంధించి ప‌రాష్కారం చూపేందుకు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు కొత్త‌గా ఓ వాద‌న‌ను బ‌య‌ట‌కు తీశారు. అదే వాద‌న‌తో నేటి ఉద‌యం పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కాగానే... ఏపీకి చెందిన ఎంపీలు త‌మ నిర‌స‌న‌ల‌ను వ్య‌క్తం చేసేదాని కంటే ముందుగానే లోక్ స‌భ వెల్ లోకి దూసుకొచ్చేసిన అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ బోర్డు కోసం పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరికి తోడుగా ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించిన అంశంలో త‌మ‌కే నిర్ణ‌యాధికారాలు వ‌దిలేయాల‌ని తెలంగాణ‌కు చెందిన టీఆర్ ఎస్ ఎంపీలు కూడా అన్నాడీఎంకే ఎంపీల‌కు తోడుగా వెల్‌ లోకి దూసుకెళ్లారు.

ఫ‌లితంగా స‌భ ఆర్డ‌ర్‌ లో లేద‌న్న కార‌ణంతో లోక్ స‌భ స్పీకర్ సుమిత్రా మ‌హాజ‌న్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. మొత్తంగా ఏపీకి చెందిన ప్ర‌త్యేక హోదా పోరును నీరుగార్చేందుకు బీజేపీ రూపొందించిన ప‌థ‌కంలో భాగంగానే అన్నాడీఎంకే ఎంపీలు స‌భ వాయిదా ప‌డేట‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ రోజుకు బీజేపీ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయినా... ఈ స‌మావేశాలు ముగిసే దాకా కూడా ఇదే త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని బీజేపీ యోచిస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా ద‌క్షిణాదికి చెందిన ఏపీ ఎంపీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ ర‌చించిన సౌత్ విరుగుడు ప్లాన్ బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుగా చెప్పుకోవాలి. అంటే... ద‌క్షిణాది నిర‌స‌న‌ల‌ను అడ్డుకునేందుకు బీజేపీ ద‌క్షిణాది మంత్రాన్నే ర‌చించింద‌న్న మాట‌.
Tags:    

Similar News