మునుగోడులో బీజేపీ వర్సెస్ బీజేపీ.. ఇదెలా సాధ్యం?

Update: 2022-09-21 03:30 GMT
మునుగోడు ఉప ఎన్నికలో  గెలుపు తప్పనిసరిగా బీజేపీ భావిస్తోంది. రాజీనామా చేయించి మరీ బరిలోకి దిగుతున్నారు.  రాజగోపాల్ రెడ్డి బీజేపీ కోసం తన రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మునుగోడులో డబ్బులు ఏరులై పారుతున్నట్టు భోగట్టా. బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి  గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. గ్రామాల్లో సభలు పెట్టి.. ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బీజేపీకి తాజాగా కొత్త తలనొప్పి వచ్చిపడింది. కొంత మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకముందు.. ఆ పార్టీ తరుఫున గంగిడి మనోహర్ రెడ్డి చాలా కష్టపడ్డారు. వచ్చేసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సడెన్ గా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఆయన ఆశలు అడియాశలయ్యాయి. గంగిడితోపాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

గతంలో గంగిడి మనోహర్ రెడ్డితో కలిసి పనిచేసిన నాయకులకు తాజాగా బీజేపీలోకి వచ్చిన వారికి పొసగడం లేదు. గంగిడి మనోహర్ రెడ్డి 2014,  2019 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ తరుఫున పోటీచేశారు. 2023లోనూ తనకే అవకాశం వస్తుందని.. ఈసారి ఎలాగైనా గెలుపు ఖాయమని దీమాగా ఉన్నారు. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో సీన్ రివర్స్ అయ్యింది.

గంగిడితోపాటు బీజేపీలో గతంలో పనిచేసిన నేతలంతా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారారు. రాజగోపాల్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని.. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ నేతల అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన నేతలు ఎప్పటినుంచో బీజేపీ కోసం పనిచేశామని.. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. గ్రామాల్లో నిర్వహించే సమావేశాలకు కూడా తమను ఆహ్వానించడం లేదని అంటున్నారు.

దీంతో చాలా గ్రామాల్లో బీజేపీ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి వర్గం బీజేపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన బీజేపీ నేతలతో ఈ  అసలు బీజేపీ వాళ్లకు పడడం లేదు. పట్టుదలతో మునుగోడులో గెలవాలనుకుంటున్న బీజేపీకి ఈ పరిణామం మింగుడుపడడం లేదు. ఎన్నికల్లో ఇది మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News