దుబ్బాక ఊపు.. సాగ‌ర్‌ లో క‌ష్ట‌మే.. బీజేపీలో లుక‌లుక‌!!

Update: 2021-03-31 01:30 GMT
తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో రెండు మాసాల కిందట జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాన్ని రిపీట్ చేయాల‌ని భావిస్తున్న రాష్ట్ర క‌మ‌ల నాథుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దుబ్బాక‌లో హోరీహోరీగా సాగిన ఎన్నిక‌ల పోరులో టీఆర్ ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ కైవ‌సం చేసుకుంది. ర‌ఘునంద‌న‌రావు.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని అధికార పార్టీకి గ‌ట్టి స‌వాల్ రువ్వారు. ఇలానే ఇప్పుడు కూడా సాగ‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ద‌క్కించుకుని టీఆర్ ఎస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌క్కా ప్లాన్‌తో ఉన్నారు. ప్లాన్ మంచిదే అయినా.. టికెట్ విష‌యంలో త‌లెత్తిన అసంతృప్తి.. నేత‌ల‌ను బీజేపీకి దూరం చేయ‌డం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పైగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అన్నీ ఆలోచించుకుని.. ఈ టికెట్‌ను దివంగ‌త నోముల న‌ర‌సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్‌కే కేటాయించారు. దీంతో యువ‌కుడు, విద్యావంతుడు అయిన భ‌గ‌త్‌కు యువ‌త ఓటు సానుకూలంగా ప‌రిణ‌మిస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జానేత‌గా పేరున్న నోముల సింప‌తీ కూడా ఇక్క‌వ వ‌ర్క‌వుట్ అవుతుంది. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే..స్థానికంగా గ‌ట్టి ప‌ట్టున్న బీజేపీ నాయ‌కుడు క‌డారి అంజ‌య్య యాద‌వ్‌.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ టికెట్ ఆశించారు. ఇప్పుడు కూడా ఆయ‌న ఆశ పెట్టుకుని.. బీజేపీని గెలుపు గుర్రం ఎక్కించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. అయితే.. టికెట్ విష‌యంలో సాగ‌దీత ధోర‌ణిని అవ‌లంభించిన బీజేపీ.. చివ‌ర‌కు అంజ‌య్య‌కు హ్యాండిచ్చింది.

రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య యాదవ్ తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న హుటా హుటిన అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అంజయ్యకు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ ప‌రిస్థితి సాగ‌ర్ బీజేపీలో క‌ల‌కలం రేపింది. మ‌రోవైపు సీనియ‌ర్ మ‌హిళా నాయ‌కురాలు.. బీజేపీ నేత డాక్ట‌ర్ నివేదితారెడ్డి కూడా బీజేపీ త‌ర‌ఫున సాగ‌ర్ టికెట్ ఆశించారు. తనకే టిక్కెట్ వస్తుందని భావించి నామినేషన్ సిద్ధం చేసుకున్నారు. అయితే రవికుమార్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆమె కూడా టీఆర్ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు.

ఈ వ‌రుస ప‌రిణామాల‌తో సాగ‌ర్ విష‌యంపై బీజేపీ అంత‌ర్మ‌థనంలో మునిగిపోయింది. దుబ్బాకలో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాక‌.. ఒక ఊపు వ‌స్తే.. సాగ‌ర్‌లో మాత్రం ప్ర‌తికూల ప‌రిస్థితి ఎదురైంది. దీంతో కేడ‌ర్ కూడా చెల్లాచెదుర‌య్యే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు.. దుబ్బాక ఉప ఎన్నిక‌కు కేంద్రం నుంచి పెద్ద‌లు వ‌చ్చి ప్ర‌చారం చేశారు. కానీ, ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న ద‌రిమిలా.. ఈ ఒక్క ఉప‌పోరు కోసం ఎవ‌రు వ‌స్తార‌నేది సందేహం. ఇక‌, మిగిలింది.. స్థానిక నేత‌లు.. దూకుడు చూపించినా.. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం.. టీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కంగా సాగ‌ర్‌లో అనుస‌రిస్తున్న విధానాలు వంటివి బీజేపీకి ఇబ్బందిగా ప‌రిణ‌మించాయి. మొత్త‌గా చూస్తే.. దుబ్బాక త‌ర‌హా దూకుడు సాగ‌ర్‌లో క‌నిపించ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తుండ‌డంతో ఇదే విష‌యంపై బీజేపీనాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.




Tags:    

Similar News