షా మాట‌!... 50 ఏళ్లు అధికారంలోనేన‌ట‌!

Update: 2017-08-20 04:45 GMT
అధికారంలో ఉన్న వాళ్లు ఐదు - ప‌దేళ్ల వ‌ర‌కూ తామే కొన‌సాగాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ దాదాపు 50 ఏళ్లు అధికారంలో ఉండిపోవాల‌ని కోరుకుంటున్నారు క‌మ‌ల‌నాథులు!! విజ‌యం అందించే కిక్కు బీజేపీ నేత‌ల‌కు పూర్తిగా త‌ల‌కెక్కేసింది! మొద‌ట్లో ఆత్మ‌విశ్వాసంలా క‌నిపించినా.. ఇప్పుడు అతివిశ్వాసంలా క‌నిపిస్తోంది. దేశంలో ప్ర‌ధాని మోదీకి వేరే ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డం.. వివిధ రాష్ట్రాల్లో అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతున్న‌ విజ‌యాలు బీజేపీ పెద్ద‌ల్లో పూర్తిగా ఆత్మ‌విశ్వాసాన్ని నింపేశాయి. ఐదేళ్లు కాదు.. ప‌దేళ్లు కాదు.. ప‌దిహేనేళ్లు కాదు.. ఏకంగా 50 ఏళ్ల వ‌ర‌కూ తామే అధికారంలో ఉండాల‌ని బీజేపీ పెద్ద‌లు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని బీజేపీ చీఫ్‌.. అమిత్‌ షా నే స్వ‌యంగా వెల్లడించడం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

బీజేపీని మ‌రింత విస్తృతం చేసే దిశ‌గా.. బీజేపీ పెద్ద‌లు పావులు క‌దుపుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా జీర్ణావ‌స్థ‌లో ప‌డిపోవ‌డం.. ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డం.. ప్ర‌ధాని మోదీకి నానాటికీ ఆద‌ర‌ణ ఎక్కువ‌వ‌డంతో ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. త‌మ‌కు మ‌రో ప‌దేళ్లు ఢోకా లేద‌ని ప్ర‌ధాన మోదీ ఒక‌ప‌క్క చెబుతుంటే.. బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం ఇది చాలా త‌క్కువ స‌మ‌య‌మ‌ని అనుకుంటున్నారు. ఇక ద‌శాబ్దాల పాటు కేంద్రంలో ఉండిపోవాల‌ని డిసైడ్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలోనే మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉన్న అమిత్‌ షా త‌మ‌ పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - కార్యకర్తలతో భేటీ అయి పలు సూచ‌న‌లు చేశారు.

బీజేపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. దేశంలో బీజేపీ 5-10 ఏళ్లు అధికారంలో ఉండేందుకు రాలేదని, కనీసం 50 సంవత్సరాలైనా ఉండాలని అన్నారు. భార‌త్‌ లో మార్పులు తీసుకురావాలనే ధ్యేయంతో ప‌నిచేయాల‌ని అన్నారు. కేంద్రంలో బీజేపీకి 330 మంది ఎంపీలు ఉన్నారని - రాష్ట్రాల్లో 1387 మంది త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. త‌మ‌ పార్టీ శిఖరాగ్ర స్థానంలో ఉంద‌ని తెలిపారు. అయితే ఇప్ప‌టికే  నోట్ల‌ర‌ద్దు - జీఎస్టీ వంటి అంశాలు.. ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపాయి - చూపిస్తున్నాయి. మ‌రి ఐదు ద‌శాబ్దాలు అంటే.. ఇంకెన్ని భ‌రించాల్సి ఉంటుందో!!
Tags:    

Similar News