గతంతో పోలిస్తే బీజేపీకి అక్కడ సీట్లు పెరుగుతాయా!

Update: 2019-04-17 07:18 GMT
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో ఈసారి తారుమారు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాత మైసూరు ప్రాంతంలోని ఎనిమిది పార్లమెంటు స్థానాలకు గానూ గత 2014 ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఈసారి ఒక్క సీటు గెలిస్తే చాలనేలా ఉంది.

పాత మైసూరులో బీజేపీ ప్రాబల్యం అంతగా లేకపోయినప్పటికీ జేడీఎస్‌ తో కాంగ్రెస్‌ జత కట్టడంతో ఈసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. పాత మైసూరు ప్రాంతంలోని ఎనిమిది లోక్‌ సభ స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సగం పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని  అంచనా. గత ఎన్నికల్లో మైసూరులో మాత్రమే బీజేపీ గెలిచింది. అయితే ఈసారి మైసూరుతో పాటు హాసన్ - చిక్కబళ్లాపుర - కోలార్‌ లో కూడా పాగా వేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ బెంగళూరు రూరల్‌లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. బెంగళూరు రూరల్‌ పరిధిలోకి రామనగర జిల్లా వస్తుండటంతో అక్కడ జేడీఎస్‌ బలం కారణంగా రూరల్‌ లో కాంగ్రెస్‌ కు ప్లస్‌ కానుంది. అదేవిధంగా జేడీఎస్‌ కేవలం తుమకూరులో మాత్రమే గెలిస్తే గగనం. అలాగే మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థి సుమలత గెలిచే అవకాశం ఉంది. 

మైసూరు - మండ్య - హాసన్ - చామరాజనగర - రామనగర - బెంగళూరు రూరల్ - కోలార్ - చిక్కబళ్లాపుర - తుమకూరు జిల్లాలు వస్తాయి. ఇందులో రామనగర మినహా మిగతా అన్నీ పార్లమెంటు నియోజకవర్గాలే. పాత మైసూరు పరిధిలో మొత్తం 8 పార్లమెంటు నియోజకవర్గాలు వస్తాయి. ఎనిమిది స్థానాలకు గానూ బీజేపీ మండ్య మినహా స్థానాల్లో పోటీ చేస్తోంది. మండ్యలో స్వతంత్య్ర అభ్యర్థి సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్‌ ఐదు  - జేడీఎస్‌ మూడు  స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి.

– మైసూరు పీఠాన్ని బీజేపీ (ప్రతాప్‌సింహా) మరోసారి సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా కాంగ్రెస్‌ అభ్యర్థి సీహెచ్‌ విజయశంకర్‌ గెలుపు కష్టమే అని చెప్పవచ్చు.

– చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థి బచ్చేగౌడకు అవకాశం ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌ అభ్యర్థి వీరప్ప మొయిలీ గెలుపు కష్టంగానే భావిస్తున్నారు.

– హాసన్‌ లోక్‌ సభ స్థానంలో ఈసారి భిన్న ఫలితాలు రానున్నాయి. కాంగ్రెస్‌ నాయకుడు ఎ.మంజు బీజేపీ తరఫున పోటీ చేస్తుండటంతో మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గం ఆయనకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఫలితంగా కూటమి అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ గెలుపు కష్టమే.

– కోలార్‌ లో ఎన్నో ఏళ్లుగా పాగా వేసిన కాంగ్రెస్‌ నేత మునియప్పకు ఈసారి పరాభవం ఎదురు కానుందని స్థానికులు చెబుతున్నారు. 

– మండ్యలో స్వతంత్య్ర అభ్యర్థి సుమలత గెలుస్తుందని దేశవ్యాప్తంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

– బెంగళూరు రూరల్‌ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ప్రాబల్యం ఉంది. ఫలితంగా కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేష్‌ మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది.

– తుమకూరులో కాంగ్రెస్‌ నాయకులు సహకరిస్తే జేడీఎస్‌ అభ్యర్థి హెచ్‌ డీ దేవెగౌడ గెలుస్తారని అంచనా వేస్తున్నారు. లేదంటే బీజేపీ అభ్యర్థి బసవరాజుకే అనుకూలం

– చామరాజనగరలో మాజీ సీఎం సిద్ధరామయ్య అనుచరుడు శ్రీనివాసప్రసాద్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈక్రమంలో సిద్దరామయ్య వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై చామరాజనగర ఫలితం ఆధారపడి ఉంది. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ ఆర్‌.ధ్రువనారాయణ్‌ పోటీలో ఉన్నారు.


Tags:    

Similar News