బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. పీకే వీడియో క‌ల‌క‌లం.. బ‌య‌టపెట్టిన బీజేపీ!

Update: 2021-04-10 06:53 GMT
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న రాష్ట్రం బెంగాల్‌. ఇక్క‌డ గ‌త ప‌దేళ్లుగా అధికారంలో ఉన్న మ‌మ‌తాబెన‌ర్జీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ వ్యూహాలమీద వ్యూహాలు వేసి.. ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. బెంగాల్‌లో బీజేపీ ప‌ట్టు సాధిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త‌మ‌కే ఢిల్లీ గ‌ద్దె  ద‌క్కుతుంద‌ని బీజేపీ నేత‌లు అంచ‌నా వేసుకున్నారు. అంతేకాదు.. రాష్ట్రాల‌పై మ‌రింత ప‌ట్టు ల‌భిస్తుంద‌ని కూడా లెక్క‌లు క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే బెంగాల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

అయితే.. బెంగాల్‌లో త‌మ‌దే మ‌రోసారి విజ‌య‌మ‌ని.. బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ తా బెన‌ర్జీ చెప్పుకొస్తున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రాల‌పై పెత్త‌నం వంటివాటిని ఆమె తీవ్రంగా వ్య‌తిరేకిస్తు న్నారు.ఈ క్ర‌మంలో హ్యాట్రిక్ కొట్టేందుకు ఆమె రాజ‌కీయ ప‌రిశీల‌కుడు, వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌ను నియ‌మించుకుని మ‌రీ .. ఎన్నిక‌ల స్ట్రాట‌జీ అమ‌లు చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ప్ర‌శాంత్ కిశోరే ఇప్పుడు బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌శాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్య‌ల తాలూకు వీడియోను బీజేపీ అగ్ర నాయ‌కుడు పార్టీ ఐటీ సెల్ చీఫ్ విజ‌య్ మాల్వియా.. తాజాగా విడుద‌ల చేశారు. ఈ వీడియోలో.. బీజేపీనే బెంగాల్లో పాగా వేస్తుందంటూ.. పీకే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. దీనికి ఆయ‌న కొన్ని రీజ‌న్లు కూడా చెప్పుకొచ్చారు. బెంగాల్‌లోని ద‌ళితులు, ముస్లింలు కూడా ఇప్పుడు మ‌మ‌త‌, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల‌కు వ్య‌తిరేకంగా ఉన్నారంటూ.. పీకే వ్యాఖ్యానించారు. బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్, టీఎంసీల పట్ల.. గత 20 ఏళ్లలో ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.

మమతా బెనర్జీ పాలన పట్ల బెంగాల్ వాసులు కోపంగా ఉన్నార‌న్న విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైంద‌ని పీకే వ్యాఖ్యానించారు. ఇదే విష‌యాన్ని విజ‌య్ ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నాలుగో ద‌శ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పీకే వ్యాఖ్య‌ల వీడియో పెను సంచ‌ల‌నంగా మార‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ వ్యాఖ్య‌లను పీకే ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తాను చేసిన వ్యాఖ్య‌ల తాలూకు.. పూర్తి వీడియోను బ‌హిర్గ‌తం చేయాల‌ని కోర‌డం విశేషం. ఏదేమైనా.. నాలుగో ద‌శ ఎన్నిక‌ల వేళ‌.. ఈ ప‌రిణామం.. మ‌మ‌త‌కు సెగ పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.Full View
Tags:    

Similar News