గుజ‌రాతీయుల ఫైన‌ల్ తీర్పు.. 99.. 80

Update: 2017-12-18 13:18 GMT
పొద్దున ఎప్పుడు తెలిసిన విష‌యాన్ని మ‌ళ్లీ ఇప్పుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఉందా? ఉద‌య‌మే గుజ‌రాత్ లో మోడీ పార్టీ గెలిచింద‌న్న విష‌యం తేలిపోయిన త‌ర్వాత ఇప్పుడింక చ‌ర్చ ఏమిట‌న్న సందేహం క‌ల‌గొచ్చు. కానీ.. అంకెలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. టీవీ స్క్రీన్ల మీదా.. కంప్యూట‌ర్ల‌లోనూ వార్త‌లు చూస్తున్న వారిలో చాలామందికి గుజ‌రాత్‌ లో బీజేపీ సాధించిన విజ‌యం క‌నిపిస్తుంటుంది.

కానీ.. ఆ విజ‌యంలో విష‌యం ఎంత‌న్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌.

మోడీని విమ‌ర్శించినా.. బీజేపీ విజ‌యాన్ని త‌క్కువ చేసి మాట్లాడినా విరుచుకుప‌డే వారు చాలామందే ఉంటారు. కానీ.. వాస్త‌వాన్ని ఎవ‌రో ఒక‌రు చెప్పాలి క‌దా. ఇప్పుడు గుజ‌రాత్ లో బీజేపీ సాధించిన విజ‌యం గురించి గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. రెండు ద‌శాబ్దాలకు పైగా పాల‌న సాగించిన త‌ర్వాత కూడా గుజ‌రాతీయులు మ‌ళ్లీ క‌మ‌ల‌నాథుల‌కు ప‌గ్గాలు అప్ప‌గించిన‌ప్ప‌టికీ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

త‌మ రాష్ట్రానికి చెందిన నేత తిరుగులేని స్థాయిలో ఉన్న వేళ‌.. ఓట‌మి పంచ్ ఇస్తే బాగోద‌ని అనుకొని ఉండొచ్చు. ప్రాంతీయ భావ‌న‌లు ఎక్కువ‌గా ఉండే గుజ‌రాతీయులు మోడీ పార్టీని ఈసారి అయిష్టంగానే గెలిపించార‌ని చెప్పాలి. కావాలంటే ఫైన‌ల్ గా వెల్ల‌డైన గ‌ణాంకాల్ని చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. ఎన్నిక‌ల ప‌లితాలు పూర్తిగా వ‌చ్చిన త‌ర్వాత చూస్తే.. జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న క‌మ‌ల‌నాథుల‌కు ద‌క్కింది 99 సీట్లు మాత్ర‌మే.

గుజ‌రాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా బీజేపీకి ద‌క్కింది 99 సీట్లు మాత్ర‌మే. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి ల‌భించిన సీట్లు 80. రెండు పార్టీల మ‌ధ్య సీట్ల తేడా కేవ‌లం 19 మాత్ర‌మే. ఒక‌వేళ‌.. ప‌ది సీట్లు కానీ బీజేపీ ఖాతాలోనివి కాంగ్రెస్ ఖాతాలోకి వ‌చ్చి ఉంటే..? ఊహించ‌టానికే వీల్లేని రీతిలో ప‌రిణామాలు చోటు చేసుకొని ఉండేవి.

మోడీ అండ్ కో గొప్ప‌గా చెప్పుకుంటున్న గెలుపు కేవ‌లం 9 అసెంబ్లీ స్థానాలు అంటే.. ఆ విజ‌యం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇంకాస్త లోతుగా చూస్తే.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన సీట్ల సంఖ్య 92. బీజేపీకి ల‌భించిన సీట్లు 99. అంటే.. మెజార్టీకి మించి బీజేపీకి వ‌చ్చిన సీట్లు కేవ‌లం ఏడు సీట్లు మాత్ర‌మే. మ‌రింత స్వ‌ల్ప అధిక్య‌త‌తో గెలిచిన గెలుపును గొప్ప విజ‌యంగా అభివ‌ర్ణించుకోవ‌టం స‌బ‌బేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌మ‌కు 150 సీట్లు గెలుస్తామ‌ని మోడీ ప‌రివారం గొప్ప‌లు చెప్పుకోవ‌టం ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా క‌నిపించింది. వారి మాట‌ల్నే ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. తాజాగా ల‌భించిన విజ‌యం ఎలాంటిదో ఎవ‌రికి వారే అర్థం చ‌సుకోవ‌చ్చు. 22 ఏళ్ల సుదీర్ఘ పాల‌న త‌ర్వాత మ‌రోసారి గెల‌వ‌టం చిన్న విష‌య‌మా అని  ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే.. ఆ విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ.. మోడీ ప్ర‌భ గుజ‌రాత్‌ లో వెలిగిపోతుంద‌ని చెప్పుకునే క‌మ‌ల‌నాథులకు గుజ‌రాతీయులు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చ‌రిక‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

వాస్త‌వానికి మొద‌టి..రెండో ద‌శ పోలింగ్‌కు మ‌ధ్య చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల్ని మ‌ర్చిపోకూడ‌దు. తాను ప్ర‌ధాన‌మంత్రిన‌న్న విష‌యాన్ని వ‌దిలేసి.. గుజ‌రాతీయుల్లో భావోద్వేగాన్ని ర‌గ‌లించేందుకు ప్ర‌ధాని హోదాలో ఉన్న మోడీ ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు. మ‌రి.. అన్నేసి ప్ర‌య‌త్నాల త‌ర్వాత వ‌చ్చిన 99 సీట్లు మా గొప్ప విజ‌య‌మ‌ని అంటే ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ.. డ‌బుల్ డిజిట్‌ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన బీజేపీ సీట్ల సంఖ్య మోడీ ప్రాభ‌వం అంత‌కంత‌కూ మ‌స‌క‌బారుతుంద‌న్న దానికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు ఒప్పుకోని బీజేపీ నేత‌లకు వారి అంత‌రాత్మ‌లు ఏం చెబుతున్నాయో వారికి బాగానే తెలుసు.
Tags:    

Similar News