ఐఏఎస్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో అమిత్ షా!

Update: 2016-09-29 07:47 GMT
లంచం తీసుకున్న కేసులో చిక్కుకుని చివరకు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి బన్సల్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరు కూడా ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది.  దీంతో విపక్షాలు దీన్ని అడ్డం పెట్టుకుని అమిత్ షాను ఇబ్బంది పెట్టొచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవ‌ల ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకున్న కేసులో బ‌న్సల్ అరెస్టయ్యారు. ఆ త‌రువాత ఆయ‌న భార్య - కూతురు ఆత్మహ‌త్య చేసుకున్నారు.  బ‌న్సల్ ఈమధ్యే బెయిల్‌ పై విడుద‌ల‌య్యారు. అంతలోనే అత‌ని కుమారుడు యోగేశ్‌ తో కలిసి బుధ‌వారం ఉరేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్నారు. చ‌నిపోయే ముందు బ‌న్సల్ రాసిన ఏడు పేజీల ఆత్మహ‌త్య లేఖ‌లో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు పేర్కొన్నాడు.  త‌న‌ను సీబీఐ అధికారులు విప‌రీతంగా వేధించిన కార‌ణంగానే తాను చ‌నిపోతున్నాన‌ని ఆ లేఖ‌లో రాశాడు. ముఖ్యంగా సీబీఐ అధికారి సంజీవ్ గౌత‌మ్ త‌న‌ను తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురి చేశాడ‌ని ఆరోపించారు. మ‌రో ఇద్దరు మ‌హిళా అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాడు. వారు బెదిరింపుల‌కు పాల్పడ‌టం వ‌ల్లే త‌న భార్య - కుమార్తె ఆత్మహ‌త్య చేసుకున్నార‌ని తెలిపాడు. త‌న‌ను - త‌న కుమారుడిని చంపుతాడ‌మ‌న్నాడ‌ని ఆరోపించాడు.  సంజీవ్ గౌతమ్ త‌న‌ను  తాను అమిత్‌షా మ‌నిషిన‌ని చెప్పుకొంటూ బెదిరించాడని...  త‌న‌ని ఎవ్వరూ ఏమీ చేయ‌లేర‌ని తీవ్రంగా బెదిరించాడ‌ని లేఖ‌లో వివ‌రించారు.

బన్సల్ లేఖతో ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. మరోవైపు బ‌న్సల్ కుమారుడు యోగేశ్ కూడా చ‌నిపోయే ముందు రెండు పేజీల లేఖ రాశాడు. త‌న త‌ల్లి, సోద‌రి  మొద‌టి నుంచి ఆత్మహ‌త్యల‌కు వ్యతిరేకమని, వారు కూడా ఆత్మహ‌త్య చేసుకునేలా సీబీఐ అధికారులు ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని ఆరోపించాడు. బన్సల్ అవినీతి వ్యవహారం సంగతి ఎలా ఉన్నా అనంతర పరిణామాలను తట్టుకోలేక ఏకంగా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడం విషాదమే. సీబీఐ అంతగా వారిని ఒత్తిడి చేయడం... సీబీఐ అధికారులు ఇలాంటి ప్రమాదకర ధోరణి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనడం సంచలనంగా మారుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News