టీడీపీ ఎంపీకి సొంత పార్టీ ఎమ్మెల్యే దెబ్బేశారుగా!

Update: 2017-04-18 13:32 GMT
నిజ‌మే... ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన అనంత‌పురం ఎంపీ దివాక‌ర్ రెడ్డిని నిలువ‌రించే స‌త్తా.. ఏకంగా పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు కూడా లేద‌న్న వాద‌న వినిపిస్తున్న మాట‌ను కాద‌నే వారు ఒక్క‌రు కూడా లేరు. అయితే జేసీని నిలువ‌రించే వారు ఎక్క‌డో బ‌య‌ట లేర‌ని, త‌న సొంత జిల్లా అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థ‌సార‌ధికి ఉంద‌ని నిన్న తేలిపోయింది. బీకే దెబ్బ‌కు ఎదురు స‌మాధానం కూడా ఇవ్వ‌లేని స్థితిలో జేసీ ప‌రారైన విష‌యం నిన్న అనంత‌పురం జిల్లాలో ఆస‌క్తికరంగా మారింది.

ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... నిన్న అనంత‌పురంలో జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జ‌డ్పీటీసీలు - ఎంపీపీల‌తో పాటు ఆ జిల్లా ప‌రిధిలోని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలకూ హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి. కేవ‌లం జిల్లా ప‌రిధిలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మాత్ర‌మే దృష్టి సారించే స‌ద‌రు స‌మావేశానికి జ‌డ్పీటీసీలు - ఎంపీపీల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఆస‌క్తి చూపుతున్న వైనం మ‌న‌కు తెలిసిందే. అయితే అరుదుగా ఎంపీలు కూడా ఈ స‌మావేశాల‌కు వస్తూ త‌మ స‌ల‌హాలు - సూచ‌న‌లు ఇస్తున్నారు. ఈ త‌ర‌హాలోనే నిన్న జ‌రిగిన అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య సమావేశానికి స్థానిక ఎంపీ హోదాలో జేసీ కూడా వ‌చ్చారు. సమావేశానికి వ‌స్తే... ఏదేనీ అభివృద్దికి స‌ల‌హా ఇవ్వాల‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయిన జేసీ... త‌న సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై విరుచుకుప‌డ‌టం మొద‌లెట్టారు.

వైసీపీ టికెట్‌ పై విజ‌యం సాధించి ఆ త‌ర్వాత టీడీపీలోకి చేరిన క‌దిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏదో స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించ‌బోగా... ఆయ‌న‌ను అడ్డుకున్న జేసీ... అసెంబ్లీలో మీరే మాట్లాడ‌తారు, బ‌య‌ట స‌భ‌ల్లోనూ మీరే మాట్లాడ‌తారు... ఇక్క‌డ కూడా మీరేనా?  కూర్చోవ‌య్యా అంటూ క‌సురుకున్నారు. దీంతో ఓ సారి ఏదో స‌ర్దిచెప్పి మాట్లాడ‌టానికి ఉద్యుక్తులైన చాంద్ బాషా... మ‌రోమారు జేసీ గ‌ద్దింపుతో కూర్చోక త‌ప్ప‌లేదు. అయితే ఈ వ్య‌వ‌హారాన్నంతా ప‌రిశీలిస్తున్న మ‌రో ఎమ్మెల్యే బీకే పార్థ‌సార‌ధి... జేసీని నిలువ‌రించేందుకు రంగంలోకి దిగారు.

పార్టీ ఎమ్మెల్యేగానే కాకుండా... పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా బీకేకు జిల్లాపైనే కాకుండా... పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌పైనా, పార్టీ కార్య‌క్ర‌మాల‌పైనా కాస్తంత అవ‌గాహ‌న ఎక్కువ‌న్న విష‌యం తెలిసిందే. చాంద్ బాషాపై జేసీ చిందుల‌ను క‌ళ్లారా చూసిన బీకే... త‌న గొంతు స‌వరించుకుని... ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను మనం చెప్పక ఎవరు చెబుతారు అని ఎంపీ జేసీని నిల‌దీశారు.  బీకే నోట నుంచి వ‌చ్చిన ఈ ఒక్క మాట‌తో జేసీకి నోట మాట రాలేద‌ట‌. అంతేనా... బీకే వారించిన త‌ర్వాత మూడంటే ముడు నిమిషాలు మాత్ర‌మే స‌మావేశంలో కూర్చున్న జేసీ... ఆ తరువాత ఏమ‌నుకున్నారో గానీ... వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News