‘బ్లాక్‌ ఫంగస్‌' కలకలం ..ఆ ఆస్పత్రిలో ఒక్కరోజే 284 మంది !

Update: 2021-05-21 05:31 GMT
దేశంలో ఓ వైపు కరోనా వైరస్ , మరోవైపు బ్లాక్ ఫంగస్ విజృంభణ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణాలు తీసే కరోనా మహమ్మారి భారి నుండి ఎలాగోలా బ్రతికి బయటపడ్డామని సంతోషించే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలు హరించి వేస్తోంది. మొదట్లో కరోనా సోకిన కొందరిలోనే కనిపించిన ఈ బ్లాక్‌ ఫంగస్‌, గత  కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌ ఫంగస్‌ మహమ్మారేనని కేంద్రం గురువారం ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో  మూడు రోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క కోఠి ఈఎన్‌ టీ ఆస్పత్రిలోనే 90 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గురువారం కూడా వందలాది మంది బాధితులు చికిత్స కోసం వచ్చారు. పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు సమాచారం. బ్లాక్‌ ఫంగస్‌పై మరీ ఆందోళన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఓవైపు బ్లాక్‌ ఫంగస్‌ విరుచుకుపడుతోంటే.. మరోవైపు వైట్‌ ఫంగస్‌ కూడా దాడి మొదలుపెట్టింది. ఇప్పటికే బీహార్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. బ్లాక్‌ ఫంగస్‌ కన్నా ఇది మరింత ప్రమాదకరమని, శరీరంలోని అన్ని అవయవాలపైనా దాని ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులతో పాటు చర్మం, మూత్రపిండాలు, గోర్లు, కడుపు, జననేంద్రియాలకూ వ్యాపిస్తుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే .. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్‌ ఫంగస్‌ అనుమానితులు ఆస్పత్రికి వస్తే , అందులో మొత్తం 39 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ చేసుకున్నారు. మిగతావారిలోనూ చాలా మందికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఉన్నా.. కొందరు పాజిటివ్‌ రోగులు కావడం, మరికొందరికి కోవిడ్‌ వచ్చి తగ్గినా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో చేర్చుకోలేదని తెలుస్తుంది. ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. మొదట 50 బెడ్లను కేటాయించగా.. ప్రస్తుతం 200 వరకు బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.  ఉదయం ముందుగా వస్తున్న రోగులకు పరీక్షలు చేస్తున్నామని, పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.  బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలకు సంబంధించి కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని సీఎంవో ఓఎస్డీ గంగాధర్‌ గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న బెడ్లు, పేషెంట్ల సంఖ్య, చికిత్సలపై ఆరా తీశారు. అంతకుముందు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. వీరికి పెద్దగా ఆక్సిజన్ అవసరం ఉండదు అని అన్నారు.
Tags:    

Similar News