న‌ల్ల కుబేరులు రూటు మార్చేశారండోయ్‌!

Update: 2017-06-19 04:33 GMT
దేశంలో బ‌డా రాజ‌కీయ వేత్త‌లు - బిజినెస్ టైకూన్లు అక్ర‌మ మార్గాల్లో సంపాదించిన మొత్తాన్ని ఎక్క‌డ దాచుకుంటారు? అన్న ప్ర‌శ్న‌కు ఏమాత్రం సంకోచించ‌కుండానే స్విస్ బ్యాంకుల్లోనే క‌దా అంటూ ఠ‌క్కున స‌మాధానం చెప్పేస్తాం. ఇక‌పై ఈ స‌మాధానం చెప్పాలంటే కాస్తంత ఆలోచించాల్సిందే. ఎందుకంటే... న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయ్యాక న‌ల్ల కుబేరుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డో స్విట్ల‌ర్లాండ్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న స్విస్ బ్యాంకుల్లో న‌ల్ల కుబేరులు దాచుకున్న సొమ్ము వివ‌రాలు కూడా నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. అంతేకాకుండా వ‌చ్చే ఏడాది నాటికి స్విస్ బ్యాంకుల్లో దాగున్న డ‌బ్బుకు సంబంధించిన య‌జ‌మానులు ఎవ‌ర‌న్న విష‌యాలు తేట‌తెల్లం కానున్నాయి.

ఈ క్ర‌మంలో మోదీ ప్ర‌ధాని అయ్యాక‌ - న‌ల్ల ధ‌నం గుట్టు విప్పేందుకు కేంద్రం న‌డుం బిగించిన మ‌రుక్ష‌ణ‌మే న‌ల్ల కుబేరులు కూడా త‌మ రూటు మార్చేశారు. ఇండియ‌న్ బ్లాక్ మ‌నీ మొత్తం స్విస్ బ్యాంకుల్లోనే ఉంద‌న్న విష‌యం ప్ర‌పంచం మొత్తానికి తెలిసిపోయిన నేప‌థ్యంలో త‌మ‌కు స్విస్ బ్యాంకుల కంటే కూడా సుర‌క్షిత‌మైన ప్రాంతాలు ఏవ‌న్న విష‌యాన్ని న‌ల్ల కుబేరులు వెత‌క‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో వారికి సింగ‌పూర్‌ - హాంకాంగ్‌ లు క‌నిపించాయ‌ట‌. అంతే... ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా స్విస్ బ్యాంకుల్లోని త‌మ న‌ల్ల ధ‌నాన్ని వారు విడ‌త‌ల‌వారీగా త‌మ కొత్త డెస్టినేష‌న్ల‌కు త‌ర‌లించ‌డం ప్రారంభించార‌ట‌. అయినా ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నేగా మీ డౌటు?  

ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్‌ లోని స్విస్ బ్యాంకుల్లోని మ‌నోళ్ల న‌ల్ల ధ‌నం మూట‌లు క్ర‌మేణా త‌రిగిపోతున్నాయ‌ట‌. 2015  చివ‌రి నాటికి... అంటే న‌రేంద్ర మోదీ ప్ర‌ధానమంత్రిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏడాదిన్న‌ర‌కు స్విస్ బ్యాంకుల్లోని మ‌నోళ్ల న‌ల్ల ధ‌నం విలువ‌ను అక్క‌డి బ్యాంకు అధికారులు రూ.8,392 కోట్లుగా తేల్చారు. అంతేకాకుండా... సింగ‌పూర్‌ - హాంకాంగ్ వంటి ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఉన్న భార‌తీయుల డిపాజిట్ల కంటే త‌మ వ‌ద్ద ఉన్న డిపాజిట్లు చాలా త‌క్కువ అని వారు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. అంటే నల్ల‌ధ‌నంపై న‌రేంద్ర మోదీ స‌ర్కారు యుద్ధం ప్ర‌క‌టించిన త‌ర్వాత న‌ల్ల కుబేరులంతా అప్ర‌మ‌త్త‌మైపోవ‌డ‌మే కాకుండా గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌మ నిధుల‌న్నింటినీ గుట్టుగా త‌మ కొత్త డెస్టినేష‌న్ల‌కు చేర్చార‌న్న మాట‌. అంటే న‌ల్ల‌ధ‌నం భ‌ర‌తం ప‌ట్టాలంటే ఇప్పుడు కేవ‌లం స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వంతో మాత్ర‌మే చ‌ర్చ‌లు జ‌రిపితే స‌రిపోదు... ప్ర‌పంచంలో ప‌న్ను క‌ట్ట‌కుండా సొమ్ము దాచుకునేందుకు అవ‌కాశ‌మున్న అన్ని దేశాల‌తోనూ చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సిందేన‌న్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News