టీడీపీకి గట్టిదెబ్బేనా ?

Update: 2021-09-22 05:00 GMT
ప్రవిలేజ్ కమిటి నిర్ణయం కరెక్టే అయితే అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీకి గట్టిదెబ్బనే అనుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటి నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి ఎక్కడా చెప్పలేదు. అయితే ఇదే కమిటిలో సభ్యుడైన టీడీపీ ఎంఎల్ఏ అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు.

అసెంబ్లీ సమావేశాల్లో లిక్కర్ షాపుల సంఖ్య విషయంలో అచ్చెన్నాయుడు, సామాజిక పింఛన్ల విషయంలో రామానాయుడు మాట్లాడిన సమయంలో సభలో తప్పుడు లెక్కలు ఇచ్చారని వైసీపీ ఎంఎల్ఏలు ఆరోపించారు. దీంతో వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదుచేశారు. తనకు వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ప్రివిలేజ్ కమిటికి పంపారు. ఇదే విషయమై తాజాగా సమావేశమైన కమిటి పై ఇద్దరిపై చర్యులు తీసుకోబోతున్నట్లు తెలిసింది.

ఈ విషయమై రామానాయుడు మాట్లాడుతు తాము మాట్లాడినదాంట్లో అబద్ధాలు ఏమీ లేవన్నారు. పైగా తనను ఉద్దేశించి జగనే డ్రామానాయుడు అంటు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమకు రెండున్నరేళ్ళ పాటు సభలో మాట్లాడకుండా మైక్ ఇవ్వకూడదని కమిటి తీసుకున్న నిర్ణయం అన్యాయమని మొత్తుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సభలో ఏ పార్టీకి మెజారిటి ఉంటే ఆ పార్టీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్.

ఇపుడు కమిటి చేసిన రికమెండేషన్ అన్యాయమని అనుకుంటే మరి టీడీపీ హయాంలో ఎంఎల్ఏ రోజాను సభలోకి రానీకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేయటం మాటేమిటి ? ఓ ఎంఎల్ఏను సభలోకి రాకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేయటమన్నది ఏ రూల్ బుక్ ప్రకారం చూసిన సాధ్యంకాదు. ఓ ఎంఎల్ఏని సస్పెండ్ చేయాలని స్పీకర్ అనుకుంటే ఆ సమావేశాలు జరిగే సెషన్ వరకు మాత్రమే చేయగలరు. ఎంఎల్ఏ సస్పెన్షన్ పై రూల్ బుక్ లో అంత స్పష్టంగా ఉన్నా దాన్ని పక్కనపెట్టేసి తాము ఏది చేయాలనుకుంటే టీడీపీ దాన్నే అమలు చేసేసింది.

అప్పట్లో తనపై సస్పెన్షన్ అన్యాయమని రోజా ఎంత మొత్తుకున్నా, కోర్టుకు వెళ్ళినా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబునాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. సభ నిర్ణయం తీసుకుంది తాను అమలు చేశానంతే అని స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు మీడియా సమావేశంలో. ఇపుడు వైసీపీకి అవకాశం వచ్చింది. అచ్చెన్న, రామానాయుడుపైన కూడా సభలో తీర్మానం పెట్టి ఆమోదింపచేసుకుని చర్యలు తీసుకుంటారు. మరి ఇపుడు కూడా సభ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించాల్సిందే కదా.

అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా రోజాపై నిర్ణయం తీసుకునేటపుడు చంద్రబాబు ముందు వెనుక ఆలోచించారా ? కాబట్టి ఎదుటివాళ్ళకు ఓ కన్ను పోవాలనుకుంటే మనకు కూడా కన్ను పోతుందన్న గ్రహింపు ఉంటే సమస్యలుడవు. కానీ రాజకీయాల్లో అలాంటి హుందాతనం పోయింది కాబట్టి చర్యకు ప్రతికార చర్య ఉంటుందని చంద్రబాబు అయినా జగన్ అయినా గ్రహించాల్సిందే. ఒక్కోళ్ళది ఒక్కోసారి పై చేయవుటుందంతే అంతే.
Tags:    

Similar News