స‌ర్జిక‌ల్ దాడుల త‌ర్వాత పాక్ ఏం చేసిందో తెలుసా?

Update: 2016-10-05 08:24 GMT
ఉరీ ఉగ్ర ఘ‌ట‌న అనంత‌రం పాకిస్థాన్‌ కు త‌గిన బుద్ధి చెప్పాల‌నుకున్న భార‌త్‌.. ఆ విధంగానే ర‌హ‌స్య ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. దాదాపు 4 కిలో మీట‌ర్లు పాక్ స‌రిహ‌ద్దులోకి దూసుకువెళ్లి మ‌రీ ఉగ్ర‌స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ దాడులు చేసింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తంగా 40 మంది ఉగ్ర‌వాదులు ప్రాణాలు కోల్పోయార‌ని భార‌త్ ప్ర‌క‌టించింది. దీనిని ఉరీ ఘ‌ట‌న‌పై విజ‌యంగా పేర్కొంది. అయితే, అదేస‌మ‌యంలో పాకిస్థాన్ మాత్రం భార‌త్ త‌మ‌పై ఎలాంటి దాడులూ చేయ‌లేద‌ని, స‌ర్జిక‌ల్ దాడులు అస్స‌లు జ‌ర‌గ‌లేద‌ని బుకాయించింది. అంతేకాకుండా స‌ర్జిక‌ల్ దాడులు చేసేంత ద‌మ్ము భార‌త్‌ కి లేద‌ని వాదించింది.

కానీ, తాజాగా ఓ జాతీయ దిన‌ప‌త్రిక వెల్ల‌డించిన క‌థ‌నం మేర‌కు స‌ర్జిక‌ల్ దాడుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు పాక్ పెద్ద ఎత్త‌గ‌డే వేసిన‌ట్టు తెలుస్తోంది. భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ దాడులు చేసిన అనంత‌రం, ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా ఈ ఘ‌ట‌న‌లో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల బాడీల‌ను పాక్ సైన్య‌మే ఘ‌ట‌నా ప్రాంతం నుంచి త‌ర‌లించింది. ఈ త‌ర‌లింపున‌కు సైన్యానికి చెందిన ట్ర‌క్కుల‌ను వినియోగించారు. వాస్త‌వానికి ఈ విష‌యాలు బ‌య‌ట ప్ర‌పంచానికి తెలీద‌ని పాక్ భావించింది. కానీ, పాక్ - భార‌త్ స‌రిహ‌ద్దు గ్రామాల్లో ఉండే ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టారు.

మన దేశంవైపు నియంత్రణ రేఖ వద్ద ఉన్న కొందరికి పాకిస్థాన్ వైపు బంధువులు ఉన్నారు.వీరు పాక్‌ లోని త‌మ బంధువుల‌తో  రహస్యంగా ఉండే చాటింగ్ సిస్టమ్‌‌ లో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ ప‌త్రిక ఈ విధానంలోనే పాక్‌ లోని వారిని సంప్ర‌దించింది. ఈ క్ర‌మంలో ఐదుగురు వ్యక్తులు స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగిన రోజు ఏం జ‌రిగిందో డిటైల్డ్‌ గా వివ‌రించార‌ట‌. వీరు వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం.. నియంత్రణ రేఖకు 4 కి.మీ. దూరంలో ఉన్న దుధ్‌ నిల్‌ లో భారత సైన్యం దాడి చేసింది. అల్హావీ బ్రిడ్జ్ పరిసరాల్లో భారీ పేలుళ్ళు వినిపించాయి. ఓ భవనం కాలిపోతుండటం కనిపించింది.

ఇక్కడ మిలిటరీ ఔట్‌ పోస్ట్ - లష్కర్ కాంపౌండ్ ఉన్నాయి. చల్హానాలో దాదాపు ఆరుగురి శవాలను ట్రక్కులో ఎక్కించారు. ఈ ట్రక్కును బహుశా సమీపంలోని నీలం నది పరిసరాల్లో ఉన్న లష్కరే తొయిబా ప్రధాన శిబిరానికి తీసుకెళ్ళి ఉండవచ్చు. దాడులు జరిగిన మరుసటి రోజు (శుక్రవారం) ప్రార్థనల సందర్భంగా లష్కరే తొయిబా అనుబంధ మశీదులో మతపెద్ద మాట్లాడుతూ తమవారిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశాడు. సో.. స‌ర్జిక‌ల్ దాడుల్లో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల‌ను పాక్ సైన్యం ఇలా ప‌ట్టుకెళ్లింద‌న్న‌మాట‌!

దేశంలోకి 100 మంది ఉగ్ర‌వాదులు

100 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దును దాటి దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ తాజాగా హెచ్చరించింది. భారత సైన్యం సిద్ధంగా ఉండాలని సూచించింది. వీలైనంత మంది ఉగ్రవాదులను భారత్‌ పైకి ఉసిగొల్పేందుకు పాక్ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులొచ్చినా బెదిరేది లేదని, తగిన గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని బీఎస్‌ ఎఫ్ డైరెక్టర్ జనరల్ కెకె శర్మ తెలిపారు. మ‌రోప‌క్క రాజౌరీ స‌హా క‌శ్మీర్‌ లోని స‌రిహ‌ద్దు జిల్లాల్లో పాక్ సైన్యం కాల్పుల‌కు తెగ‌బ‌డుతూనే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News