పెద్ద నోట్ల ర‌ద్దు వెనుక షాకింగ్ లెక్క?

Update: 2018-02-12 08:09 GMT
ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. దేశ ప్ర‌జ‌ల‌తో పాటు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాలూ సైతం మోడీ నిర్ణ‌యానికి అవాక్కు అయ్యేలా చేశాయి. పెద్ద నోట్ల ర‌ద్దు ల‌క్ష్యం కేవ‌లం బ్లాక్ మ‌నీని కంట్రోల్ చేయ‌టానికేన‌ని చెప్ప‌టం తెలిసిందే.

తాజాగా వెలుగు చూస్తున్న విష‌యాలు చూస్తే ఆశ్చ‌ర్యంతో అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. న‌ల్ల‌ధ‌నం క‌ట్ట‌డి కోసం కంటే కూడా అంత‌కు మించిన విష‌యం ఏదో ఉంద‌న్న అభిప్రాయాన్ని క‌లిగించేలా ఉన్నాయ‌ని చెప్పొచ్చు. ప్ర‌భుత్వ సంస్థ‌లే వేలాది కోట్ల రూపాయిలు డ‌బ్బు గ‌ల్లంతు కావ‌టానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని.. దీంతో పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌న్న సందేహానికి గురి చేసే అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి.

అస‌లేం జ‌రిగిందంటే.. 2000-11 మ‌ధ్య కాలంలో ముద్రించిన నోట్లు.. వాటి చలామ‌ణికి సంబంధించి ఆర్‌ బీఐ.. క‌రెన్సీ ముద్ర‌ణ సంస్థ‌ల నుంచి స‌మాచారాన్ని సేక‌రించారు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కార్య‌క‌ర్త మ‌నోరంజ‌న్ రాయ్‌. త‌న‌కు అందిన స‌మాచారాన్ని విశ్లేషించే క్ర‌మంలో ఆయ‌న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాల్ని గుర్తించారు. అదేమంటే.. నోట్ల ముద్ర‌ణ త‌ర్వాత ఆర్ బీఐ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండానే పెద్ద ఎత్తున న‌గదు గ‌ల్లంతు అయిన‌ట్లు గుర్తించారు.

దీంతో..ఆ మొత్తం ఏమైంద‌న్న సందేహంతో పాటు.. అందుకు బాధ్యులు ఎవ‌రో గుర్తించాల‌ని కోరుతూ 2015 బాంబే హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. ఇందులో ప్ర‌తివాదులుగా ప్ర‌ధాన‌మంత్రితో పాటు కేంద్ర ఆర్థిక‌. హోం మంత్రుల్ని చేర్చారు. రాయ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్లో పేర్కొన్న మూడు పేర్ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ రాయ్‌ను నాటి అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ అనిల్ సింగ్ కోరారు. చివ‌ర‌కు ఆ పిల్ ను 2016 ఆగ‌స్టు 23న బాంబే హైకోర్టు కొట్టేసింది.

అనుకోకుండా జ‌రిగిందో.. లేక వ్యూహాత్మ‌కంగానో కానీ రాయ్ పిటిష‌న్ ను కొట్టేసిన 75 రోజుల త‌ర్వాత ప్ర‌ధాని పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. వేల కోట్ల రూపాయిల మొత్తం గ‌ల్లంతు అయ్యిందంటూ రాయ్ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మ‌రి.. దీనిపై కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News