ఆ ప్రముఖుడి ఆత్మకథను ఇకపై అమ్మకూడదు

Update: 2021-11-05 03:53 GMT
ప్రముఖ పారిశ్రామికవేత్తగా సుపరిచితుడు.. రేమాండ్ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్ గా వ్యవహరించిన విజయపత్ సింఘానియా ఆత్మకథపై బాంబే హైకోర్టు తాజాగా సరికొత్త పరిమితుల్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఆయన ఆత్మకథ ‘‘ఎన్ ఇన్ కంప్లీట్ లైఫ్’’ పుస్తకం అమ్మకాల్ని.. డిస్ట్రిబ్యూషన్ మీదా బాంబే హైకోర్టు నిషేధాన్ని జారీ చేసింది. దీంతో.. ఈ పుస్తకాన్ని అమ్మే అవకాశం లేదు.

ఎందుకిలా అంటే.. విజయపత్ సింగానియాకు ఆయనతో విడిపోయిన కుమారుడు గౌతమ్ సింఘానియాకు సంబంధించి రేమండ్ కంపెనీతో న్యాయ సంబంధమైన వివాదం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పుస్తకంలో విజయపత్ పేర్కొన్న విషయాలు ఆయన నుంచి విడిపోయిన కుమారుడికి పరువు నష్టం వాటిల్లేలా ఉన్నాయన్న ఆరోపణ ఉంది. దీనికి సంబంధించిన వివాదం న్యాయస్థానంలో ఉంది.

ఈ పుస్తకంలో గోప్యత హక్కును ఉల్లంఘించటంతో పాటు.. సంస్థ వ్యాపార కార్యకలాపాలు.. ఇతర రహస్య సమాచారాన్ని చర్చించటాన్ని ఆయన కొడుకు తప్పు పడుతున్నారు. ఆయన ఆత్మకథపై నిషేధాన్ని విధించాలని కోరుతూ 2019లో ఠాణె జిల్లా సెషన్స్ కోర్టును.. ముంబయిలోని సివిల్ కోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో ఠాణె జిల్లా సెషన్స్ కోర్టు పిటిషన్ దాఖలు చేసిన ఏడాది ఏప్రిల్ లో పుస్తకం మీద బ్యాన్ విధించింది.

అయినప్పటికీ విజయపత్ సింఘానియా.. ఆయన ప్రచురణ కర్తలు కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారంటూ ఆరోపిస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు కంపెనీ గురువారం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన వెకేషన్ బెంచ్.. పుస్తకం తదుపరి విక్రయాలు.. పంపిణీ.. సర్క్యులేషన్ ను ఆపేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులపై విజయపత్ సింఘానియా ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


Tags:    

Similar News