హ‌ర్ట‌యినందుకే టీడీపీకి బొండా ఉమా దూరం?

Update: 2017-07-23 07:57 GMT
తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత - ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర రావు ఎక్క‌డ‌? తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాపుల ఉద్య‌మం స‌మ‌యంలో అండ‌గా నిల‌వాల్సిన బొండా ఉమ తెర‌మీద‌కు రాక‌పోవ‌డం తెలుగుదేశం పార్టీ శ్రేణులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం చ‌లో అమ‌రావ‌తి పేరుతో కీల‌క‌మైన పాద‌యాత్ర‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించి స‌న్నాహాల్లో బిజీబిజీగా ఉన్న స‌మ‌యంలో కూడా బొండా ఉమా స్పంద‌న లేక‌పోవ‌డం పార్టీలో కొత్త సందేహాల‌కు తెర‌తీస్తోంది.

సుదీర్ఘ‌కాలం క‌స‌ర‌త్తు చేసిన అనంత‌రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే బొండా ఉమామాహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో చోటు కల్పించకుండా కాపుల గొంతు కోస్తున్నారన్న బొండా ఆరోపించారు. త‌ను క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచాన‌ని, కాపుల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వ త‌ర‌ఫున గ‌ళం వినిపించాన‌ని బొండా అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే బొండా ఉమ  వ్యాఖ్య‌ల‌పై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగిన బొండాతో సీఎం చంద్రబాబుతో స‌మావేశం అయిన సందర్భంగా చంద్రబాబు మండిపడినట్టు ప్ర‌చారం సాగింది. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బొండాను నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో బొండాకు చెందిన పలు కబ్జా వివాదాలను సైతం ప్రస్తావించి సీఎం షాక్‌ ఇచ్చినట్టు సమాచారం. ఆర్టీఏ కమిషనర్‌ గన్‌ మెన్‌ పై దాడి చేసినా.. కేసు పెట్టని విషయాన్ని సీఎం గుర్తుచేశారని, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారని సమాచారం. మంత్రివర్గం విషయంలో కాపుల అంశాన్ని వివాదం చేస్తారా? అంటూ చంద్రబాబు బొండాపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బొండా ఉమా త‌న దూకుడుకు బ్రేక్ వేసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇటు కాపుల‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు చేయ‌డం, అటు పార్టీ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేన‌ప్పుడు ఎందుకు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాల‌నే భావ‌న‌కు బొండా ఉమ వ‌చ్చార‌ని విజ‌య‌వాడ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే కాపు ఉద్యమం తారాస్థాయికి చేరిన‌ప్ప‌టికీ ఆయ‌న కిమ్మ‌న‌కుంటా ఉంటున్నార‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News