నంద్యాల‌లో బోండా బెదిరింపులు చూశారా?

Update: 2017-08-02 10:38 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించి తీరాల్సిందేన‌ని ఏపీలో అధికార పార్టీ టీడీపీ గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌లో విజ‌యం సాధిస్తేనే... త‌మ‌కు ప‌ట్టున్న‌ట్లు జ‌నం భావిస్తార‌ని యోచిస్తున్న బాబు అండ్ కో... నంద్యాల‌లో విజ‌యం కోసం ఏ ఒక్క అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మూడేళ్లుగా లేనిది... ఉప ఎన్నిక‌కు ముందుగా నంద్యాల అభివృద్ది కోస‌మంటూ టీడీపీ స‌ర్కారు నంద్యాల‌కు ఏకంగా వంద‌లాది కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేసేసింది.

ఓ వైపు ప్ర‌చారం హోరాహోరీగా సాగుతుంటే... మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల పేరిట టీడీపీ నేత‌లు నానా హంగామా చేస్తున్నారు. ఎంత‌మేర అభివృద్ధి నిధులు కుమ్మ‌రించినా... ఎక్క‌డ అప‌జ‌యం ప‌ల‌క‌రిస్తుందోన‌న్న భ‌యంతో చంద్ర‌బాబు... త‌న మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను అక్క‌డ మోహ‌రించారు. టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓటేయాలంటూ ప్ర‌చారం చేస్తున్న వీరంతా త‌మ‌దైన శైలిలో బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ త‌ర‌హా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అడ్డంగా బుక్కైపోయిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త కొద్ది రోజులుగా నంద్యాల‌లోనే మ‌కాం వేసిన బోండా... నిన్న‌ ఉద‌యం త‌న అస‌లు సిస‌లు ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టార‌ట‌. ఇందులో భాగంగా నంద్యాలలోని 24వ వార్డు కౌన్సిలర్‌ దిలీప్‌ ఆధ్వర్యంలో నిన్న‌ వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ వసతిగృహంలో వృద్ధుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఉపఎన్నిక ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్యఅతిథిగా హాజరై భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వసతిగృహంలో పనిచేసే ఉద్యోగులను ఓట్లు అడిగి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారట‌.
Tags:    

Similar News