కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు కావాలా?

Update: 2016-03-20 08:44 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పంట అయిన డబుల్ బెడ్రూం ఇంటిని సొంతం చేసుకునే అద్భుత అవకాశం అందరికి లభించనుంది.కాకుంటే.. ఉచితంగా కాదు కానీ.. కాస్త ఖర్చు చేస్తే డబుల్ బెడ్రూం సొంతం అయినట్లే. ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు పేదవారు కావాల్సిన అవసరం లేదు. దిగువ మధ్యతరగతి.. మధ్య తరగతి జీవులకు కూడా సొంతిల్లు కల నెరవేర్చేలా టీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

కాకుంటే.. ఏడాదికి రూ.6లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే చాలు.. ఈ డబుల్ బెడ్రూం ఇంటిని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే.. నెలకు రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు డబుల్ బెడ్రూం ఇంటిని సొంతం చేసుకునే వీలుందన్న మాట. నగరంలో టీ సర్కారు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇంటికి రూ.9లక్షల వరకూ ఖర్చు అవుతుందని జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ చెబుతున్నారు.

ఈ ఇళ్లకు కేంద్రం రూ.2.5లక్షలు.. గ్రేటర్ హైదరాబాద్ మహాపాలక సంస్థ రూ.2లక్షలు ఇవ్వనుందని.. మిగిలిన మొత్తంలో రూ.2 లక్షలు లబ్థిదారులు తొలుత చెల్లిస్తే.. మిగిలినది బ్యాంకుల నుంచి వాయిదాల పద్ధతిలో ఇంటిని సొంతం చేసుకునే బంఫర్ ఆఫర్ ప్రకటించనుందని ఆయన చెబుతున్నారు. అంటే..రూ.9లక్షల ఇల్లు.. కేవలం రూ.4.5లక్షలకే లభిస్తుందన్న మాట. ఈ మాటే నిజమైతే.. గ్రేటర్ పరిధిలో సొంతింటి కల చాలామందికి నెరవేరటం ఖాయమనటంలో సందేహం లేదు. మరి.. అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో మరి..?
Tags:    

Similar News