త్వరలో భారత్ లో బూస్టర్ డోసు... అధ్యయనం చేస్తున్న కేంద్రం..!!

Update: 2021-12-25 07:34 GMT
కరోనా కొత్త వేరియంట్ కేసులు భారత్లో కూడా క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు కోవిడ్ కేసులు కూడా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదల పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలల్లో కోవిడ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. వీటికి తోడు కొత్త వేరియంట్ కేసులు కూడా భారీ స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్లో కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసు పై అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

పెరుగుతున్న కేసులను అదుపు చేయడానికి బూస్టర్ డోసు ఏకైక మార్గం అని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను వివిధ దేశాలు అనుసరిస్తున్న బూస్టర్ డోసు విధానాన్ని భారత్లో కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు మూడో వ్యాక్సిన్ను కూడా ఆ దేశ పౌరులకు అందిస్తున్నాయి. వీటితో పాటు మిగతా దేశాలు కూడా బూస్టర్ డోస్ పై ఆలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసులను పూర్తిస్థాయిలో తీసుకున్న సుమారు 3 వేల మందిని సేకరించి వారిపై ప్రభుత్వం బూస్టర్ డోసు పై అధ్యయనం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అధ్యయనం అంతా హర్యానాలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉండే పరీక్షా కేంద్రంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా, అమెరికా , బ్రిటన్ దేశాలు ఇప్పటికే మూడో టీకాను పౌరులకు అందిస్తున్నాయి. కొత్త వేరియంట్ ను అడ్డుకోవాలి అంటే కచ్చితంగా బూస్టర్ డోసు తీసుకోవాల్సిందేనని ఇప్పటికే కొన్ని వైద్య ఆరోగ్య సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బూస్టర్ డోసు తీసుకోవడంపై ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. ఇదిలా ఉంటే యూరప్ లోని కొన్ని దేశాలలో ఈ మూడో డోసు పైన విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటే.. మరికొందరు వెనకడుగు వేస్తున్నారు. అయితే స్థానికంగా ఉండే శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం మరికొద్ది రోజుల్లోనే మూడో వేవ్ రానున్నట్లు పేర్కొన్నారు. దీనిని అడ్డుకోవాలంటే ప్రజలందరూ ఖచ్చితంగా బూస్టర్ డోసు ను తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

పెరుగుతున్న కేసుల పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందని నీతి అయోగ్ సభ్యుడు అయిన వి కె పాల్ చెప్పారు. దేశ ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వడం పై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags:    

Similar News