అమరావతి శ్మశానం చూడడానికి వస్తున్నావా బాబూ

Update: 2019-11-26 05:59 GMT
శ్మశానంగా ఉన్న రాజధాని అమరావతిని చూసి ఏడవడానికి వస్తున్నావా చంద్రబాబు అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పర్యటనకు నిర్ణయించారు. దీనికి కౌంటర్ గా మాట్లాడిన  మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడం కొంత వివాదాస్పదమైంది. బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ , హైకోర్టు, సచివాలయం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయలాంటి రాజధానిని శ్మశానంతో పోల్చడం ఏంటని టీడీపీ సీనియర్ నేత యనమల  మండిపడుతున్నారు.  మంత్రి బొత్సాను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్మశానం నుంచే సీఎం జగన్ పాలిస్తున్నారా అని ప్రశ్నించారు.

ఇక తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఐదేళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు ఏం చేయడానికి చంద్రబాబు వస్తున్నారన్న కోణంలోనే తాను ‘శ్మశానం’ పదం ఉపయోగించానని మంత్రి బొత్స  సర్ధిచెప్పారు. గత నాలుగేళ్లలో రాజధాని కోసం చంద్రబాబు ఏం ఊడబొడిచాడని ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో నాలుగేళ్లలో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా 35000 ఎకరాలు తీసుకుందని.. వాటిని ఎందుకు అభివృద్ధి చేయలేదంటూ నిలదీశారు.చంద్రబాబు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశంతోనే శ్మశానం అన్నాను తప్పా రాజధానిని అవమానించాలన్న ఉద్దేశం తనది కాదని బొత్స వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News