ప‌నులు కావాలంటే చంద్ర‌బాబును అడుక్కో: మ‌హిళా స‌ర్పంచ్ పై ఎమ్మెల్యే ఆగ్ర‌హం

Update: 2022-07-14 06:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తున్న‌ ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అధికార పార్టీ నేత‌లు విరుచుకుపడుతున్న ఘ‌ట‌న‌లు వైర‌ల్ అవుతున్నాయి. స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తుంటే ప్ర‌జ‌లైనా, ప్ర‌తిప‌క్ష నేత‌లైనా, ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌జాప్ర‌తినిధులైనా ఇలా ఎవ‌రినీ చూడ‌కుండా అధికార వైఎస్సార్సీపీ నేత‌లు దాడుల‌కు దిగ‌డం, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌టం వంటివి చేస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరిట వైఎస్సార్సీపీ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలోనూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్న ప్ర‌జ‌ల‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరుపారేసుకోవ‌డం, ప్ర‌శ్నించిన‌వారిపై అక్ర‌మ కేసులు మోప‌డం వంటివి చేస్తున్నార‌ని అంటున్నారు.

తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తిన‌గ‌రంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప‌నులు చేయించాల‌ని అడిగినందుకు ఒక టీడీపీ మ‌హిళా స‌ర్పంచ్ పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోద‌రుడు, ఎమ్మెల్యే కూడా అయిన బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య చిందులు తొక్కార‌నే వార్త వైర‌ల్ గా మారింది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళ్తే...గ‌జ‌ప‌తిన‌గ‌రం మండల పరిషత్తు కార్యాలయంలో జూలై 14న‌ నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య‌, ఇతర ప్రజాప్రతినిధులు, రామన్నపేట సర్పంచ్ రుంకాణ అరుణ హాజరయ్యారు. ఈమె తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

తన పంచాయతీ పరిధిలో మంజూరైన పాల కేంద్రం భవన నిర్మాణానికి జిన్నాం గ్రామ‌ సర్పంచ్ పేరుతో చెల్లింపులు చేయడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్ అరుణ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇప్పటికే ఆ పనులు శ్లాబు స్థాయికి చేరుకున్నాయని ఏఈ అప్ప‌ల‌నాయుడు స‌మాధాన‌మిచ్చారు.

అప్పట్లో జిన్నాం సచివాలయ పరిధిలో ఆ భవనం ఉంది కాబట్టి ఆ గ్రామంలో నిర్మించారని తెలిపారు. కాబ‌ట్టి జిన్నాం సర్పంచ్ ఖాతా నంబరే ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. తన పంచాయతీ పరిధిలో మంజూరైన రహదారులనూ జిన్నాం సర్పంచ్ పేరుతో ఎలా చేస్తారంటూ సర్పంచ్ అరుణ నిలదీశారు.

దీంతో వైఎస్సార్సీపీ ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీ స‌ర్పంచ్ అరుణ‌తో వాదనకు దిగారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య‌ కలుగజేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న‌కు నచ్చినట్లు పనులు చేయిస్తాన‌ని.. డ‌బ్బులు మీకెందుకు ఇవ్వాలంటూ ఆమెపై మండిప‌డ్డారు. ఇప్పటికే బిల్లు అయింద‌ని... ఇప్పుడు ఏం చెప్పినా ఆగద‌న్నారు. తెలుగుదేశం పార్టీ డ్రామాలు త‌న వ‌ద్ద సాగ‌వ‌న్నారు. పనులు కావాలంటే వెళ్లి చంద్రబాబు నాయుడిని అడుక్కోండి అని అరుణ‌పై ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో అరుణ‌ ఒక్కరే టీడీపీ. మిగిలినవారంతా అధికార పార్టీ వారే. వారితోపాటు ఎమ్మెల్యే అప్ప‌ల న‌ర‌స‌య్య కూడా ఒక్కసారిగా అరుణ‌పై విరుచుకుపడడంతో ఆమె కన్నీరుపెట్టారు.
Tags:    

Similar News