కేటీఆర్ మాటలకు బొత్స కౌంటర్.. నీకు ఫ్రెండ్ చెప్పాడు.. నేను హైదరాబాద్ లోనే ఉన్నా

Update: 2022-04-29 10:34 GMT
నీ గొప్ప కోసం పక్కోడ్ని చిన్నతనం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏపీ అధికారపక్షం పరిస్థితి అలానే ఉంది. నిన్నటివరకు తమ పాలన మీద విపక్షాలు విమర్శలు చేస్తే వారిని ఇష్టారాజ్యంగా తిట్టేయటం.. మీడియా వేలెత్తి చూపిస్తే.. పచ్చ మీడియా అంటూ ప్రచారం చేయటం.. సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శలు చేస్తే..ఏదో ఒక తోక తగిలించేసి.. అదంతా పచ్చి అబద్ధమన్నట్లుగా చెప్పటం అలవాటైన వైసీపీ నేతలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. ఇటీవల కాలంలో వారికి ఇలాంటి టాస్కు ఎదురు కాలేదు.

ఏమైందో ఏమో కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. పక్క రాష్ట్రానికి చెందిన తన స్నేహితుడు సంక్రాంతికి ఊరికి వెళ్లి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఫోన్ చేయటం..పక్క రాష్ట్రం (ఏపీని ఉద్దేశించి) లో కరెంటు.. నీళ్లు.. రోడ్లు ఏమీ లేవని.. పరిస్థితి దారుణంగా ఉందన్న మాట వైసీపీ నేతలకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

ఎందుకంటే.. తెలంగాణ అధికారపక్షాన్ని ఉద్దేశించి ఏమంటే.. ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే.. ఏపీ మంత్రులు కావొచ్చు.. అధికార పక్షానికి చెందిన నేతలు కావొచ్చు. వారి ఆస్తులు మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నాయి.

తమ ప్రత్యర్థుల మీద విరుచుకుపడినట్లుగా మాట్లాడితే.. చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. ఏపీ రాష్ట్రంలోని పరిస్థితి గురించి మంత్రి కేటీఆర్ అన్నేసి మాటలు అన్న తర్వాత కూడా ఆచితూచి అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

సాధారణంగా మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వస్తే ఊగిపోతారు. తమ ప్రత్యర్థులపై తీవ్ర పదజాలాన్ని వాడేస్తారు. అలాంటి ఆయన సైతం మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆచితూచి అన్నట్లుగా ఉన్నాయే తప్పించి.. నేచురల్ గా సత్తిబాబు సీరియస్ అయితే ఎలా ఉంటుందో అలా మాత్రం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఏపీ గురించి కేటీఆర్ ప్రత్యక్షంగా ఏమీ చూడకుండానే ఆయన స్నేహితుడు చెప్పిన మాటల్ని నిజమని నమ్మి ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. తలెంగాణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినా తాను ఎవరికి చెప్పుకోవటం లేదు కదా? అని వ్యాఖ్యానించారు. ‘ఏపీ గురించి కేటీఆర్ కు ఎవరో స్నేహితుడు ఫోన్ చేశాడేమో. నేను నిన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉన్నా.

కరెంటు లేక జనరేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఇది నేనెవరితోనూ చెప్పలేదు కదా?’’అని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన స్థాయిలోఉండి అలా మాట్లాడకూడదన్న బొత్స.. మీ దగ్గర జరిగిన డెవలప్ మెంట్ ఏమిటో చెప్పుకోవచ్చు కానీ పక్క రాష్ట్రాలను విమర్శించొద్దు అంటూ చెప్పిన మాటలు బొత్స నోటి నుంచి వచ్చిన తీరు చూస్తే.. వినయ విధేయత రామా అన్నట్లు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కస్సుమనాల్సిన వేళ.. ఇంత ఆచితూచి మాటలెందుకంటారు బొత్స బాబాయ్?
Tags:    

Similar News