కేసు నుంచి బాబు బయటపడే మార్గం ఇది....

Update: 2015-06-22 07:44 GMT

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ర్టాల్లో ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్లు ఆడియో టేపులు విడుదల అవడం, టీ న్యూస్ కు ఏపీ సర్కారు నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చకచకా సాగిపోతున్నాయి. అదే క్రమంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ పెరిగిపోతోంది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు నిర్దోషిత్వం రుజువు కాకుంటే ఆయన సీఎం పదవి సంగతి ఏంటి? దోషిగా తేలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు! అనే చర్చ సాగుతోంది.  చంద్రబాబు ఈ కేసులో తప్పు చేయలేదు అని తేలితే బావుండు అని కొందరు కోరుకుంటున్నారు. వీటిన్నింటినిటికి పరిష్కారంగా, ఓటుకు నోటు కేసు సాఫీగా పరిష్కారం దొరికే మార్గం తేల్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పొట్టిగా సత్తిబాబు.

సత్తిబాబు ఇటీవలే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియా సంస్థతో సత్తిబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఓటుకు నోటు ప్రస్తావన వచ్చింది. ఈక్రమంలోనే బాబు పరిపాలనపై గరం అయిన సత్తిబాబు...పనిలో పనిగా ఓటుకు నోటు కేసుకు పరిష్కారం కూడా చెప్పేశారు. ఓటుకు నోటు కేసు న్యాయస్థానంలో నడుస్తోంది కాబట్టి దానిపై మాట్లాడటం సరికాదన్నారు. అయితే... చంద్రబాబు తన నిర్దోషినని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

అందుకు మంచి మార్గంగా తన ఉదాహరణ చెప్పారు. వైఎస్ సీఎంగా ఉన్న హయాంలో తనపై వోక్స్‌వ్యాగన్‌ కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి గుర్తుచేశారు. ఆ ఆరోపణలపై సీబీఐ విచారణ వేయమని తానే కోరినట్లు ప్రస్తావించారు. ఈ కేసులో తదనంతరం జరిగిన విచారణలో తనకే సంబంధమూ లేదని తేల్చి కేసును కొట్టేశారని తెలిపారు. విచారణ అనంతరం జర్మన్‌ దౌత్యవేత్త వచ్చి తమవాళ్లే మోసం చేశారని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు కూడా సేమ్ టూ సేమ్ చేయాలని సూచించారు. తనపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబే సీబీఐ విచారణ చేయించుకుంటే అయిపోతుంది కదా! అని చెప్పేశారు. తద్వారా బాబుపై విమర్శల జోరు తగ్గుతుందని కూడా బొత్స అన్నారు.

Tags:    

Similar News