బంద్‌ పై బాబు కుట్ర‌..ఆయ‌న మృతికి కార‌కులెవ‌రు?

Update: 2018-07-24 14:27 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం వైఎస్ ఆర్‌ సీపీ తలపెట్టిన బంద్‌ ను విఫలం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నిందని  పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ - టీడీపీ - జనసేన పార్టీలు చెప్పాయని, ఎన్నికలు పూర్తి కాగానే మాట మార్చారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. కేంద్రంతో నాలుగేళ్లు చంద్రబాబు లాలూచీ పడి..ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు డ్రామాలాడుతున్నారన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రధాన ప్రతిపక్షంగా నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో పోరాటం చేసి ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచామన్నారు. టీడీపీ కూడా యూటర్న్‌ తీసుకునే విధంగా పోరాడింది వైఎస్ ఆర్‌ సీపీనే అని గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్ - బీజేపీ - టీడీపీ కలిసి పోటి చేశారని, ఆ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా తెస్తామని మాట ఇచ్చారని బొత్స స‌త్య‌నారాయ‌ణ గుర్తు చేశారు. ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు దాక్కుంటున్నారని ప్రశ్నించారు. ప్ర‌జ‌ల కోసం గ‌లం విప్పి..ఇవాళ ఏపీ బంద్‌ కు పిలుపునిస్తే...ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విఫలం చేయాలని ప్రయత్నం చేశారని నిలదీశారు. ఎందుకు అరెస్టు చేయించారని, ప్రజలను భయభ్రంతులకు గురి చేశారని, దుర్గారావు మృతికి కారకులెవరని ప్రశ్నించారు. ఇటీవల చంద్రబాబు మనకు అన్యాయం జరిగిందని చెప్పారని, మీకు నచ్చిన విధంగా నిరసనలు తెలపాలని చెప్పి..వెంటనే మాట మార్చారన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముద్దు అన్న చంద్రబాబు..ఇప్పుడు హోదా పల్లవి ఎత్తుకున్నారని పేర్కొన్నారు.

సీఎం చంద్ర‌బాబు - టీడీపీ నేత‌లు అమరావతిలో ఒకటి..పార్లమెంట్‌ లో మరొక మాట మాట్లాడుతున్నారని బొత్స‌ విమర్శించారు.  చంద్రబాబు తమకు మిత్రుడే అని కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ మాట్లాడారని గుర్తు చేశారు. బీజేపీతో వైఎస్ ఆర్‌ సీపీ కుమ్మక్కు అయ్యిందని మాపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ లాగా ముందోమాట..వెనుకోమాట మాట్లాడుతున్నామా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఢిల్లీని ఢీకొట్టింది వైఎస్ ఆర్‌ సీపీనే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటిరిగానే పోటీ చేస్తామని, ఎవరైతే ప్రత్యేక హోదా  ఇస్తామని ప్రకటిస్తారో వారికే మద్దతిస్తామన్నారు.
Tags:    

Similar News