ముంబై, చెన్నై లాగానే...విశాఖ‌ప‌ట్ట‌ణం కూడా

Update: 2020-01-29 10:26 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్‌ల బాబుగా మారిపోయార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఎద్దేవా చేశారు. జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ నివేదికలు చెత్త, తప్పులతడక, బోగస్ అని విమ‌ర్శించి ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశార‌ని ఆయ‌న ఆరోపించారు. `నిన్న‌టి వ‌ర‌కూ ఆ నివేదిక‌ల‌ను విమ‌ర్శించారు. బోగిమంటల్లో కాల్చారు. ఇవాళ ఆ రిపోర్టుల‌లో విశాఖ రాజధానికి అనుకూలం కాదు అని చంద్రబాబు, పచ్చ పత్రికలు అంటున్నాయి. ఇంత వేగంగా వైఖ‌రి మార్చ‌డం వారికే చెల్లింది. ఏదయినా మాట్లాడేప్పుడు పరిశీలించి, ఆలోచించి మాట్లాడాలి.. అప్పుడే విలువ ఉంటుంది`` అని అన్నారు.

నిపుణులతో కూడిన కమిటీల నివేదికలు పరిశీలించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని బొత్స వివ‌రించారు. ``వైజాగ్ సైక్లోన్ ప్రభావిత ప్రాంతమే అయినా ప్రమాదం లేదు. ముంబై, చెన్నైలు కూడా సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలే. వైజాగ్‌లో ల్యాండ్ పూలింగ్ పేదలకు ఇళ్లను నిర్మించేందు కోసమే చేస్తున్నాం. వైజాగ్‌లో 1.76 లక్షల మంది ఇల్లులేని పేదలున్నారు. వారి కోస‌మే ఈ సేక‌ర‌ణ‌.`` అని తెలిపారు. నిబంధనల ప్రకారమే మండలిలోని వికేద్రీకరణ బిల్లులపై నిర్ణయం తీసుకుంటామ‌ని బొత్స తెలిపారు. ప్రస్తుత పరిస్దితుల కారణంగా కొంత జాప్యం అవుతుంది తప్ప రాజధానుల ప్రక్రియ ఆగదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. `టీడీపీ, వారికి వత్తాసు పలుకుతున్నవారికి సూటి ప్రశ్న వేస్తున్నాం. వికేంద్రీకరణకు మీరు అనుకూలమా? ప్రతి కూలమా?`. అని ప్ర‌శ్నించారు.

శాసనమండలి విషయం లో కూడా చంద్రబాబు మాటలు గమనించాలని బొత్స అన్నారు. ``గతంలో ఏం మాట్లాడారు,ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి. చంద్రబాబుకు అనుకూలంగా, రాజకీయ లబ్ది ఉంటే కరెక్ట్ అంటారు.. లేదంటే విమర్శిస్తున్నారు. రాజ‌ధాని విష‌యం లో ప్రభుత్వం అనేక కోణాల్లో ఆలోచించి, కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంది. కానీ చంద్ర‌బాబు నిన్న చెత్త అన్న జిఎన్ రావు కమిటీ మంచిది ఎలా అయ్యింది? చంద్రబాబుకు ఎప్పుడూ యు టర్న్, నిర్దిష్టం గా ఎప్పుడూ ఉండ‌రు` అని మండి ప‌డ్డారు.
Tags:    

Similar News