ప్రపంచమంతా వికీలీక్స్.. ఏపీలో ‘బొత్స లీక్స్’

Update: 2020-03-02 05:55 GMT
వికీ లీక్స్.. ప్రపంచమంతా జరిగిన గుట్టుమట్లు, జరగబోయే అనర్థాలు, సీక్రెట్ గా జరిగే వ్యవహారాలను వెలికితీసే సంస్థ. పలు దేశాలు రహస్యంగా చేయబోయే పనులు, చేసిన వాటిని బయటపెట్టి సంచలనం సృష్టించింది. దీంతో కక్షగట్టిన అగ్రరాజ్యాలు ఆ సంస్థ అధిపతి అసాంజేను జైలు పాలు చేశాయి.

అయితే ప్రపంచానికి వికీలీక్స్ ఎలాగో.. ఏపీకి ఇప్పుడు ‘బొత్స లీక్స్’ అలాగే మారిపోయింది. అమరావతి రాజధాని మార్పు, మూడు రాజధానులపై మొట్టమొదట అందరికంటే ముందు లీక్స్ ఇచ్చింది మంత్రి బొత్స సత్యనారాయణ కావడం విశేషం. సీఎం జగన్, వైసీపీ అధిష్టానం ఏ పని చేయాలనుకున్నా మొదట బొత్సతోనే దాన్ని జనబాహుల్యంలోకి తీసుకెళుతున్నారు.

బొత్స ఏదైనా మాట అన్నాడంటే ఇప్పుడు ఏపీలో జరిగి తీరుతుందన్నమాట.. అమరావతి మార్చుతున్నామని బొత్స అన్నాడు. సీఎం జగన్ చేసేశాడు. ఇక విశాఖ రాజధానిని బొత్స చేస్తామన్నాడు. జగన్ బిల్లు పెట్టి పాస్ చేయించాడు.

ఇక లోకేష్ సహా అందరూ అమరావతి కుంభకోణం పై విచారణ జరపించమంటే జరిపిస్తామని మొదట అన్నది బొత్సనే. ఇప్పుడు సీఐడీ విచారణ సాగుతోంది.

ఇక బిల్లులు అడ్డుకుంటున్న శాసన మండలిలో రచ్చ చేసిన బొత్స దాన్ని లేకుండా చేయాలని అన్నాడు. జగన్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

ఇలా ఒకటా రెండా? చాలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను మొదట లీక్ చేసేది బొత్సనే. సీనియర్ కావడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పని చేయడం.. అపార అనుభవం దృష్ట్యా బొత్సను ముందు పెట్టి జనాలలో చర్చకు పెట్టి.. దాన్ని నానేలా చేసి.. దానిపై జనం నిర్ణయానికి అనుగుణంగా అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఇలా జగన్ తుపాకీ లో ఇప్పుడు బొత్స ఓ బుల్లెట్ అవుతున్నాడన్న చర్చ సాగుతోంది.


Tags:    

Similar News