తెలంగాణ చింత‌మ‌నేని బాధితురాలికి గోల్డ్ మెడ‌ల్‌

Update: 2019-08-15 06:40 GMT
ఎఫ్ ఆర్ ఓ అనిత గుర్తుందా?  తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్‌ పార్టీకి చెందిన నేతలు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ అటవీ రేంజ్‌ అధికారి (ఎఫ్ ఆర్ ఓ) చోలె అనిత. జూన్‌ 30న సార్సాల గ్రామంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు - ఆసిఫాబాద్‌ జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ కోనేరు కృష్ణ - అతని అనుచరులు ఆమెపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొంది.. కోలుకున్న అనంతరం మళ్లీ అదే రేంజ్‌ లో విధుల్లో చేరి తన ఉద్యోగధర్మాన్ని నిర్వర్తిస్తుస్తున్నారు. కోనేరు కృష్ణ తీరును త‌ప్పుప‌డుతూ ఆయ‌న్ను తెలంగాణ చింత‌మ‌నేని అని కొంద‌రు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలాఉంటే - ఎఫ్ ఆర్ ఓ అనిత మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ఆమె గోల్డ్ మెడ‌ల్‌ ను సొంతం చేసుకున్నారు.

అట‌వీ శాఖలో విశేష సేవలందించి మృతిచెందిన ఐఎఫ్ ఎస్‌ కేవీఎస్‌ బాబు స్మారకార్థం ప్రతియేటా అటవీ శాఖ ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గోల్డ్‌ మెడల్‌ అందించడంతో పాటు రూ.15,000 నగదును అట‌వీశా అందిస్తోంది. పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నామినేషన్లను పరిశీలించి ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీ ఈ ఏడాదికి కాగజ్‌ నగర్‌ రేంజ్‌ అధికారి చోలె అనితను ఎంపిక చేసింది. అట‌వీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (హెడ్‌ ఆఫ్‌ పారెస్ట్‌ ఫోర్స్‌) ఆర్‌.శోభ ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌ దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ అకాడమీలో ఆమె గోల్డ్‌ మెడల్‌ అందుకోనున్నారు.

దాడి స‌మ‌యంతో పాటుగా అనంత‌రం ధైర్య‌సాహ‌సాల‌తో విధులు నిర్వ‌హించ‌డంతో  ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల నుంచి తనకు ప్రాణభయం ఉందనే ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఆమెకు గన్‌ మెన్లను కూడా నియమించింది. తాజాగా మ‌రోమారు అనిత వార్త‌ల్లో ప్ర‌త్యేకంగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News