షోకుల‌కు పోయిన ఆ దేశాధ్య‌క్షుడికి క‌రోనా

Update: 2020-07-07 18:21 GMT
ప్రపంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌‌లం సృష్టిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి వివిధ దేశాల్లో త‌న పంజా విసురుతున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం నమోదైన కరోనావైరస్ కేసులపరంగా యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 16,28,283 మంది క‌రోనా బారిన ప‌డ‌గా 65,000 మందికి పైగా బ్రెజిలియన్లు క‌రోనాతో మరణించారు. అంత‌ భారీ సంఖ్య‌లో కేసులు న‌మోదైన బ్రెజిల్ దేశంలో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో  కరోనా  పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో మూడు సార్లు నెగ‌టివ్ రాగా తాజాగా బోల్స‌నారోకు పాజిటివ్ వ‌చ్చింది. ఈ ప‌రీక్ష‌లు పూర్త‌యి ఆసుపత్రి నుంచి వచ్చిన అనంతరం బ్రెసిలియాలోని ప్యాలెస్‌లో మాట్లాడుతూ, తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో ధృవీకరించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న ఆయ‌న ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు.

కాగా, క‌రోనా ప్రభావానికి తీవ్రంగా గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అమెరికా నిలిచిన‌ప్ప‌టికీ లాక్ డౌన్ ప్రకటించేందుకు ససేమిరా అని బోల్సనారో  వివాదానికి తెరతీశారు. బ్రెజిల్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తూ మరణమృదంగం మోగిస్తున్నా బొల్సనారో ఎప్పటికప్పుడు కరోనా నియమాలను ఉల్లంఘిస్తూ వార్తల్లోకి ఎక్కారు. సామాజిక దూరాన్ని పాటించక‌పోవ‌డం, ర్యాలీలలో ప్రజలకు హ్యాండ్‌షేక్‌ ఇవ్వడమే కాక వారిని కౌగిలించుకున్నారు. మాస్క్‌ ధరించకుండా బార్బి‌క్యూలను నిర్వహించడం, హాట్‌ డాగ్‌ల కోసం బయటకు వెళ్లడం వంటివి చేశారు.
Tags:    

Similar News