వైసీపీ వ‌ల‌స‌ల‌కు బ్రేక్ పడిందా?

Update: 2016-05-24 06:11 GMT
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఆగాయా? త్వరలో జగన్ పార్టీమొత్తం ఖాళీ అవుతుందంటూ అధికార పార్టీ నేతలు చేసిన ప్రకటనల్లో నిజమెంత ఉంది? వైసీపీకి రాజ్యస‌భ సీటు దక్కకుండా చేయాలన్న టీడీపీ వ్యూహం ఎంత వరకు వచ్చింది? పెద్దల సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసల అంశం మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

వైసీపీ మొత్తం ఖాళీ అవడం గ్యారెంటీ....జగన్ ఒక్కరే పార్టీలో మిగులుతారు.. వైసీపీకి ద‌క్కే ఒకే ఒక్క రాజ్యస‌భ సీటు కూడా టీడీపీ ఖాతాలో పడుతుంది....ఇవీ.. కొద్ది రోజుల కిందట టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు. దానికి తగ్గట్లుగానే వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ప‌దిహేడు మంది శాసన సభ్యులు టీడీపీ గూటికి చేరడంతో...అధికార పార్టీ నేతల మాటలు అందరూ నిజమనే నమ్మారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వ‌ల‌స‌ల‌కు బ్రేక్ పడినట్లే క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే...మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారన్న మాటలు నిజమయ్యే వాతావరణం కనిపించడం లేదు. మ‌హానాడులో కొంత‌మంది శాసన సభ్యులు చేరుతార‌ని చెబుతున్నా ఇప్పటివ‌ర‌కు వారెవరో ఖ‌రారు కాలేదని స‌మాచారం. వచ్చే నెలలో జరిగే రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో జగన్ పార్టీకి సీటు దక్కకుండా టీడీపీ అగ్రనేత‌లు వ్యూహ‌ం సిద్ధం చేసినా..అది సక్సెస్ అయ్యే ప‌రిస్థితి కాన రావడంలేదని అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే..వైసీపీ ఎమ్మెల్యేల రాక వల్ల ఎంతోకాలంగా టీడీపీని న‌మ్ముకుని ప‌ని చేస్తున్న నేత‌ల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్నింటికంటే కీల‌కంగా ప్రకాశం - క‌ర్నూలు జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయలోపం ఏర్పడింది. పైగా.. అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. దీంతో.. పార్టీ మారాలనుకున్న వైసీపీ నేతల్లో అంతర్మథనం మొద‌లైనట్లు సమాచారం. దీంతో వ‌ల‌స‌ల‌కు బ్రేక్ ప‌డింద‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News