యువ‌నేస్తానికి బ్రేక్‌!... బాబుకు బొమ్మేనా?

Update: 2019-03-30 08:30 GMT
టీడీపీ అత్యంత కీల‌కంగా భావిస్తున్న ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు షురూ అయిపోయాయ‌నే చెప్పాలి. నిన్న‌టికి నిన్న ఇంటెలిజెన్స్ డీజీ బ‌దిలీ - వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యోదంతాల‌పై హైకోర్టు ఇచ్చిన సంచ‌ల‌నాత్మ‌క తీర్పుల నేప‌థ్యంలో ఈసీ కూడా త‌న‌దైన శైలి కొర‌డా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ వెంట‌నే యువ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు టీడీపీ స‌ర్కారు రెడీ చేసిన యువ‌నేస్తం కింద అంద‌జేస్తున్న నిరుద్యోగ భృతి పెంపు కుద‌ర‌ద‌ని తేల్చేసింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని, ఉద్యోగం రాని వారిని నిరుద్యోగ భృతి కింద నెల‌కు రూ.2 వేల చొప్పున సాయం అంద‌జేస్తామ‌ని టీడీపీ మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ హామీని అట‌కెక్కించేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... తీరా ఐదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌న‌గా... నిరుద్యోగ భృతికి యువ‌నేస్తం అంటూ కొత్త పేరు త‌గిలించేసి నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.1,000 చొప్పున అందించ‌నున్నట్లు ప్ర‌క‌టించింది. ఎన్నిక‌లు మ‌రింత స‌మీపిస్తున్నాయ‌న‌గా ఈ మొత్తాన్ని రూ.2 వేల‌కు పెంచుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చేనాటికి రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో కోడ్ అమ‌ల్లో లేని ఆరు జిల్లాల్లో అమ‌లు చేసింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ ముగిసిపోవ‌డం, ఆ వెంట‌నే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేయ‌డం జ‌రిగింది. అయితే యువ‌నేస్తం మొత్తం పెంపును ముందే ప్ర‌క‌టించామ‌ని, ఇప్పుడు దానిని అమ‌లు చేయ‌నున్న‌ట్లు టీడీపీ స‌ర్కారు ప్ర‌క‌టించ‌డంతో పాటుగా ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ప్ర‌స్తావ‌న‌నే ప‌క్క‌న‌పెట్టేసి అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైపోయింది. దీనిపై దృష్టి సారించిన ఎన్నిక‌ల సంఘం... ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో యువ‌నేస్తం పెంపు కుద‌ర‌ద‌ని తేల్చేసింది.

ఈ ప్ర‌క‌ట‌న టీడీపీకి షాకివ్వ‌గా... ఇక‌పై టీడీపీ స‌ర్కారు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌లు ప‌థ‌కాల‌కు కూడా బ్రేకులు ప‌డే అవ‌కాశాలు లేకపో్లేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు టీడీపీ వేసిన ప్లాన్ అస‌లు ఉద్దేశాన్ని ఈసీ గుర్తించింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. యువ‌నేస్తం మాదిరిగానే... ప‌సుపు కుంకుమ‌ - అన్న‌దాతా సుఖీభ‌వ‌ - డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సెల్ ఫోన్ల పంపిణీ త‌దిత‌రాల‌కు కూడా బ్రేకులు ప‌డిపోయిన‌ట్టుగానే తెలుస్తోంది. మొత్తంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టే దిశ‌గా సాగుతున్న టీడీపీ ప‌థ‌కాల‌కు వ‌రుస‌గా బ్రేకులు ప‌డిపోవ‌డం ఖాయ‌మేన‌న్న మాట‌. ఈ లెక్క‌న ఇక‌పై బాబుకు అడుగ‌డుగునా బ్రేకులు త‌ప్ప‌వ‌న్న మాట‌.
Tags:    

Similar News