సంచ‌ల‌నం.. మంత్రి బొత్స‌కు 60 మంది ఎమ్మెల్యేల లేఖ‌లు!

Update: 2022-07-19 06:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాఠ‌శాలల విలీనం వ‌ల్ల త‌ల్లిదండ్రులు ఇబ్బందిప‌డిన‌ట్టు లేదా విలీనం చేసిన‌ట్టు నిరూపిస్తే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని మంత్రి బొత్స స‌త్యనారాయణ ఇటీవ‌ల స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా పాఠ‌శాల‌ల విలీనాన్ని వ్య‌తిరేకిస్తూ సాక్షాత్తూ 60 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే బొత్స‌కు లేఖలు రాశారు. ఈ లేఖలు సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో మ‌రి బొత్స రాజీనామా చేస్తారా అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి.

పాఠ‌శాల‌లను విలీనం చేయ‌డం వ‌ల్ల కొన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు పాఠ‌శాల‌లు చాలా దూర‌మ‌య్యాయ‌ని, దీనివల్ల విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆ లేఖ‌ల్లో 60 మంది ఎమ్మెల్యేలు స్ప‌ష్టం చేశారు. అందువ‌ల్ల పాఠ‌శాల‌ల విలీనాన్ని ఆపాల‌ని కోరారు. ఈ స్కూళ్ల విలీనాన్ని ఆప‌క‌పోతే ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని బొత్స‌కు రాసిన లేఖ‌ల్లో ఎమ్మెల్యేలు స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విలీనంపై పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు. విలీనం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ తాము వేరే బ‌డుల‌కు వెళ్లిపోతామ‌ని, త‌మ‌కు టీసీలు ఇచ్చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విలీనంపై స‌మ‌స్య‌లు ఉంటే తెలియ‌జేయాలంటూ ఎమ్మెల్యేల‌కు మంత్రి బొత్స లేఖ రాశారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా అసెంబ్లీలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను క‌లిసిన 60 మంది ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు లేఖ‌ల‌ను స‌మ‌ర్పించారు. ఈ లేఖ‌ల్లో ఒక్కో ఎమ్మెల్యే మూడు నుంచి నాలుగు పాఠ‌శాల‌ల వివ‌రాల‌ను పేర్కొన్నార‌ని చెబుతున్నారు. వాట‌న్నింటినీ క్రోడీక‌రించి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ యోచిస్తున్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా 5,250 పాఠ‌శాల‌ల‌ను విలీనం చేస్తుండ‌గా.. వీటిలో 270 పాఠ‌శాల‌ల‌కు వెళ్లేందుకు వాగులు, వంక‌లు, రహ‌దారులను దాటి వెళ్లాల్సి వ‌స్తోంద‌ని త‌ల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News