బ్రేకింగ్ : ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా !

Update: 2021-05-27 08:02 GMT
ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తీవ్ర చర్చనీయాంశమైంది. పరీక్షలను రద్దు చేయాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తుంటే.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పడం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగానే ..  ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో  కరోనా వ్యాప్తితో పాటు షెడ్యూల్ లోగా ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో శ్రీకాకుళానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సూచించింది. ఈ సందర్భంగా పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ తరఫున న్యాయవాది తెలిపారు.  కర్ఫ్యూ అమలయ్యే సమయంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది పడే అవకాశముందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వాయిదా వేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

జూలైలో మరోసారి పడవ తరగతి పరీక్షల నిర్వహణపై  సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇంతవరకు ప్రకటించలేదు. ఇదిలా ఉంటే టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కష్టమని ఇటీవల విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖరాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో కరోనా సెకండ్ వేవ్, పాజిటివ్ కేసుల తగ్గితే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక మే మొదటివారంలో ప్రారంభం కావాల్సిన ఇంటర్ పరీక్షలు హైకోర్టు జోక్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదోతరగతి పరీక్షలను కూడా వాయిదా పడ్డాయి.
Tags:    

Similar News