కాల్పుల‌కు ముందే ఆమె వార్నింగ్ ఇచ్చింద‌ట‌

Update: 2017-10-03 07:50 GMT
భూత‌ల స్వ‌ర్గంగా అభివ‌ర్ణించే లాస్‌ వేగాస్ లో ఇప్పుడు శ్మ‌శాన వైరాగ్యం నెల‌కొంది. నిత్యం రాత్రి వేళ ఉర‌క‌లెత్తించే ఉత్సాహంతో ఊగిపోయి.. పొద్దున్నే నిద్ర‌మ‌త్తుతో సోగుతూ ఉండే.. లాస్ వేగాస్ ఇప్పుడు శోక సంద్రంలో  నిండి పోయింది. సంగీత క‌చేరిని ల‌క్ష్యంగా చేసుకొని ద‌గ్గ‌ర్లోని హోట‌ల్ లోని 38వ అంత‌స్తులోని రూము నుంచి ఆటోమేటిక్ పిస్ట‌ల్ సాయంతో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌టం తెలిసిందే.

ఈ ఘోర ఘ‌ట‌న‌లో ఏకంగా 58 మంది బ‌లి కాగా 515 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. జోరుగా సాగుతున్న సంగీత క‌చేరి చివ‌రిద‌శ‌లో ఉన్న వేళ‌.. అక్క‌డున్న వేలాది మంది త‌న్మ‌య‌త్వంతో ఊగిపోతున్న వేళ‌.. హ‌టాత్తుగా చోటు చేసుకున్న తుపాకీ కాల్పులు భారీ ప్రాణ‌న‌ష్టాన్నే క‌లిగించాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాల్పులు జ‌ర‌గ‌టానికి ముందు ఒక జంట వ‌చ్చింద‌ని.. వారిలో మ‌హిళ పిచ్చి పిచ్చిగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.  కాల్పుల‌కు 45 నిమిషాల ముందు వ‌చ్చిన స‌ద‌రు మ‌హిళ అంద‌రిని హెచ్చ‌రించ‌టంతో పాటు.. చాలామంది జుట్టు ప‌ట్టి లాగిన‌ట్లుగా ప్ర‌త్య‌క్ష‌సాక్షి బ్రియ‌న్నా హెండ్రిక్స్ చెప్పారు.

త‌న 21వ పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌టానికి క‌న్స‌ర్ట్ జ‌రుగుతున్న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఆమె మాట్లాడుతూ.. ఒక జంట వ‌చ్చార‌ని.. పిచ్చిపిచ్చిగా వ్య‌వ‌హ‌రించార‌ని.. అంద‌రూ చ‌చ్చిపోనున్న‌ట్లుగా చెప్పార‌న్నారు. వారు వెళ్లిన కాసేప‌టికే ఈ కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లుగా ఆమె వెళ్ల‌డించారు. కాల్పులు జ‌ర‌టానికి ప‌దిహేను నిమిషాల ముందే తాను వెళ్లిన‌ట్లుగా బ్రియ‌న్నా పేర్కొంది. జుట్టు లాగి మ‌రీ.. చ‌నిపోతున్న‌ట్లుగా వ్యాఖ్యానించిన మ‌హిళ ఎవ‌రు? ఆమె ఎందుక‌లా వ్య‌వ‌హ‌రించింది? చ‌నిపోతున్న‌ట్లుగా ఎందుకు చెప్పింది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయి. అమెరికా చ‌రిత్ర‌లోనే అత్యంత విషాద‌మైన కాల్పులుగా చెబుతున్న ఈ కేసు మ‌రింత లోతుగా ప‌రిశీలించ‌టానికి స‌ద‌రు జంటకు సంబంధించిన స‌మాచారం తెలిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News