దేశం స‌మ‌స్య బాబు స‌మ‌స్య కాదా?

Update: 2016-10-16 08:43 GMT
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడిని పెంచుతున్నాయి. ఇన్నాళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ద‌క్క‌క‌పోవ‌డం బాబు ప్ర‌య‌త్న లోప‌మ‌ని విమ‌ర్శించ‌గా తాజాగా క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఏపీలో ప‌ర్య‌టిస్తూ చంద్ర‌బాబు స‌ర్కార్ తీరుపై మండిప‌డ్డారు.

ఏపీ వాసి అయిన వేముల రోహిత్ మ‌ర‌ణం గురించి  దేశం మొత్తం చ‌ర్చిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న‌ చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం విడ్డూరంగా ఉందని బృందాకార‌త్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కనీస ప్రజాస్వామ్య పద్ధతులైనా అనుసరించడం లేదన్నారు.  రైతుల విషయంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు ఒకే పద్ధతి అనుసరిస్తున్నారని బృందా ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. తుందుర్రులోని ఆక్వా ఫుడ్‌ పార్కు వల్ల 40 గ్రామాల వరకూ పంటలు దెబ్బతింటాయని, అయినా చంద్రబాబు దానికే మద్దతు ఇస్తున్నారని తెలిపారు. లక్షలాది లీటర్ల మురుగు నీటిని కాలువల్లోకి వదిలితే మత్య్స ఉత్పత్తులు కూడా దెబ్బతింటాయని, దీనివల్ల మృత్స్యకారులు ఉపాధి కోల్పోతారని బృందా కార‌త్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మెగా ఆక్వా ఫుడ్‌ పార్కుకు ఎవరి అనుమతులూ లేవని పేర్కొన్న బృందా దీన్ని వ్యతిరేకించిన వారిపై 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని, నెల రోజుల నుండి 144 సెక్షన్‌ అమలు చేస్తుండ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

ఉమ్మడి పౌరసత్వం పేరుతో ముస్లిములకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నార‌ని బృందా కార‌త్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టారు. ముస్లిం సంస్కర్తలు చెప్పినట్లు వాళ్ల పద్ధతులను కొనసాగనీయాలని, వాటిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యయుతం కాదని పేర్కొన్నారు. దేశంలో నల్లధనం నిగ్గు తేల్చాలని, అదే సమయంలో కార్పొరేట్లకు ఇచ్చిన రూ.5 లక్షల కోట్ల రాయితీల వ్యవహారాన్ని తేల్చా లని బృందా కార‌త్‌ డిమాండ్‌ చేశారు. నల్లధనం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బృందా విమర్శించారు. ఒకవైపు కార్పొరేట్లకు వేల కోట్లు రాయితీలిస్తూ, మరోవైపు నల్లధనం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో పది కార్పొరేట్‌ కంపెనీ లకు రూ.65 వేల కోట్ల మినహాయింపులు ఇచ్చారని, వీటి సంగతి ఏమిటని ప్రశ్నించారు. నల్లధనాన్ని దేశంలోకి తీసుకొస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తూ నల్లధనం గురించి చర్యలు తీసుకుంటున్నట్లు మాట్లాడుతూ కేంద్రం విచిత్ర వైఖరి అనుసరిస్తోందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News