రాణి బర్త్ డేకి జనాల ఖర్చు రూ.9వేల కోట్లు?

Update: 2016-04-11 22:30 GMT
అనగనగా ఒక రాణి. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని రాజ్యంగా పేరొంది.. ఇప్పటికే అగ్రదేశంగా పేరున్న దేశానికి రాణిగా వ్యవహరిస్తున్న ఆమె బర్త్ డే వేడుకల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రాజరికం పోయి.. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడినా.. బ్రిటన్ లో మాత్రం రాజరికారానికి పరిమిత మోతాదులో ప్రాధాన్యత ఇవ్వటం తెలిసిందే. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ రాణికి ఇచ్చే విలువ.. మర్యాదలో మాత్రం లోటు రానివ్వకుండా చూసుకోవటం ఒక విశేషం. ప్రభుత్వాలు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు సైతం మహరాణికి.. రాజరిక కుటుంబానికి అమితంగా ప్రాధాన్యత ఇస్తుంటారు.

అంతేకాదు.. రాణిగారి పుట్టినరోజు వేడుకుల కోసం వారిచ్చే ప్రాధాన్యత చూస్తే నోటి వెంట మాట రాదంతే. ఎందుకంటే.. ఆమె పుట్టిన రోజు వస్తుందంటే చాలు.. బ్రిటన్ దేశమంతా పండగ చేసుకుంటుందట. ఈ విషయాన్ని తాజాగా ‘ది సండే టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఇటీవల సదరు పత్రిక ఒక సర్వే నిర్వహించింది. రాణిగారి పుట్టినరోజు నాడు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారా? అని ఆరా తీస్తే మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవం బయటకు వచ్చింది.

రాణిగారి బర్త్ డేను దేశంలోని మూడొంతుల ప్రజలు ఘనంగా ఎవరికి వారు జరుపుకుంటారట. ఇంట్లో మనిషి పుట్టిన  రోజుకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అదే తరహాలో ప్రజలు రాణిగారి పుట్టినరోజును జరుపుకుంటారని..ఆ రోజున పార్టీలు చేసుకోవటం.. పబ్బులు.. బార్లకు వెళతారట. ఒక అంచనా ప్రకారం రాణి బర్త్ డే సందర్భంగా దేశ ప్రజలు మొత్తంగా పెట్టే ఖర్చు రూ.9వేల కోట్లు ఉంటుందట. ఏప్రిల్ 21న రాణివారి అసలు బర్త్ డే. ఈ ఏడాది బర్త్ డే ప్రత్యేకత ఏమిటంటే.. ఆమె 90వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 21 నుంచి జూన్ 11 వరకూ వేడుకలు నిర్వహించనున్నారు. 
Tags:    

Similar News