బ్రిట‌న్ ప్రిన్స్.. పిలిప్ క‌న్నుమూత‌!

Update: 2021-04-09 13:12 GMT
బ్రిట‌న్ రాజ‌కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ప్రిన్స్ పిలిప్ క‌న్నుమూశారు. 99 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న పిలిప్‌.. భార‌త కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల ప్రాంతంలో తుదిశ్వాస విడిచిన‌ట్టు స‌మాచారం. బ్రిటీష్ రాజ్య చ‌రిత్ర‌లోనే ఎక్కువ కాలం ప్రిన్స్ గా కొన‌సాగిన వ్య‌క్తిగా పిలిప్ నిలిచారు.

మొద‌ట నేవీ ఆఫీస‌ర్ గా ప‌నిచేసిన ఆయ‌న‌.. 1947లో క్వీన్ ఎలిజ‌బెత్-2 ను వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఐదు సంవ‌త్స‌రాల‌కే ఎలిజ‌బెత్-2 బ్రిట‌న్ సింహాస‌నాన్ని అధిష్టించారు. మ‌హారాణితో 65 ఏళ్లు పాల‌న‌లో భాగం పంచుకున్న పిలిప్‌.. 2017లో ప్ర‌జాపాల‌న నుంచి వైదొలిగారు.

ఈ ఏడాది జూన్ 10న ఫిలిప్ వంద‌వ పుట్టిన రోజు జ‌ర‌గాల్సి ఉంది. ఈ వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించాల‌ని భావించారు. కానీ.. ఇంత‌లోనే ఈ విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న పిలిప్‌.. ఈ మ‌ధ్య‌నే ఆసుప‌త్రిలో చేరారు. చికిత్స పొందుతుండ‌గానే ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస విడిచారు.

పిలిప్ మ‌ర‌ణ వార్త‌తో బ్రిట‌న్ రాజ‌కుటుంబంతోపాటు దేశ ప్ర‌జ‌లు విషాదంలో మునిగిపోయారు. దేశ ప్ర‌ముఖులు రాజ‌కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నారు. పిలిప్ - ఎలిజ‌బెత్-2కు మొత్తం న‌లుగురు సంతానం ఉన్నారు.
Tags:    

Similar News