నీరవ్ మోడీకి డబుల్ షాకిచ్చిన బ్రిటన్ కోర్టు

Update: 2022-12-16 04:35 GMT
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.11 వేల కోట్లను రుణంగా బ్యాంకు నుంచి తీసుకొని పత్తా లేకుండా పోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ గురించి తెలిసిందే. వేలాది కోట్లు జనం సొమ్ము దోచేసి.. తన దారిన తానుపోవటమే కాదు.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న అతగాడిని భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే.

దర్జాగా దోచేసి.. గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని వీడిన అతడ్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. క్యాలెండర్లు మారిపోతున్నాయే కానీ అతగాడిని మాత్రం తీసుకురాలేని పరిస్థితి.

ఇలాంటి వేళ.. అనూహ్యంగా బ్రిటన్ కోర్టు అతగాడికి డబుల్ షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న అతడ్ని.. భారత్ కు అప్పగించటాన్నివ్యతిరేకిస్తూ బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకునేందుకు లండన్ హైకోర్టు నో చెప్పేయటం గమనార్హం.

నీరవ్ మోడీకి ఇదో షాకింగ్ పరిణామంగా చెబుతున్నారు. గుజరాత్ కు చెందిన ఈ 51 ఏళ్ల వజ్రాల వ్యాపారి.. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.11 వేల కోట్ల భారీ మొత్తాన్ని రుణంగా తీసుకోవటం తెలిసిందే.

ఆ వివరాలు బయటకు రావటానికి ముందే అతను దేశం నుంచి పారిపోయాడు. ఈ కుంభకోణం బయటకు వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇంత కాలం అవుతున్నా.. అతను తినేసిన వేలాది కోట్ల సంగతి తర్వాత.. ముందు అతగాడ్ని దేశానికి తీసుకురావటానికే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా బ్రిటన్ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తనను భారత్ కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని నీరవ్ మోడీ వాదనలు వినిపించాడు. ఈ వాదనను సదరు కోర్టు కొట్టేసింది. నీరవ్ మానసిక పరిస్థితి.. ఆయన ఆత్మహత్య చేసుకునే ఆలోచన వస్తుందన్న కారణంగా భారత్ కు ఆయన్ను అప్పగించటం అన్యాయం అవుతుందన్న విషయాన్ని తాము ఏకీభవించటం లేదని స్పష్టం చేసింది.

అంతేకాదు.. అతడి వాదనను తప్పు పట్టటంతో పాటు.. అతడి పిటిషన్ ను కొట్టేయటంతో పాటు.. అతడికి చట్టపరమైన ఖర్చుల్లో భాగంగా రూ.1.5 కోట్లు కోర్టుకు చెల్లించాలని స్పష్టం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త సంవత్సరంలో నీరవ్ మోడీ భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News