విద్యపై ఫోకస్ పెంచిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్..!

Update: 2023-01-04 11:59 GMT
బ్రిటన్లో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో ఏకంగా ముగ్గురు ప్రధానులు మారారు. ఈ క్రమంలోనే కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రవాసీ భారతీయుడు రిషి సునాక్ ప్రధాని రేసులో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రిటన్ ను గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రిషి సునాక్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్లో పలు సంస్కరణలు చేపడుతున్నారు.

భారత్ తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రిషి సునాక్ ఆ మేరకు భారతీయులకు వీసాల విషయంలో పలు సడలింపులు ఇచ్చారు. చైనా.. అమెరికా తదితర దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో భారతీయులు సైతం బ్రిటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టగా ద్రవ్యోల్భణం.. వైద్య సేవల్లో సంక్షోభం.. జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మె దిగడం వంటి సమస్యలు చుట్టుముట్టాయి. ద్రవ్యోల్భణం కట్టడిపై రిషి సునాక్ దృష్టి సారిస్తూనే దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో రిషి సునాక్ జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఆ ప్రసంగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే బయటికి వచ్చాయి. ‘ఇది నా అనుభవపూర్వకంగా గ్రహించాను.. జీవితంలో నేను పొందిన ప్రతి అవకాశం విద్య వల్లనే లభించింది.. అందుకు నేను అదృష్టవంతుడను.. ప్రతి చిన్నారి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.. సరైన ప్రణాళికలతో దీనిని అందించాలనుకుంటున్నాను’ అని ఆ ప్రసంగంలో పేర్కొనబడింది.

ప్రస్తుతం బ్రిటన్ 16 నుంచి 19 ఏళ్ళ లోపు మధ్య వయస్సున్న వారిలో సగానికి పైగా యువత గణితాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవడం లేదు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అనలిటికల్ నైపుణ్యాలు తప్పనిసరి కానున్నాయి. ఈ నైపుణ్యాలు లేకుండా వారిని బయటికి పంపించడం వల్ల వారికి నిరాశే ఎదురవుతుందని రిషి సునాక్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన బ్రిటన్ కోసం 18 ఏళ్ల వయస్సులోని ఉన్న విద్యార్థులంతా గణితాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అలాగే యువకులు దేశంలోని ద్రవ్యోల్బణం.. ఇంధన బిల్లులు.. వైద్య సేవల సంక్షోభంపై ఆందోళనకు గురి కావద్దని చెబుతున్నారు. మెరుగైన విద్య అక్రమ వలసల సమస్యకు చెక్ పెడుతుందని రిషి సునాక్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కన్జర్వేటివ్ పార్టీ నుంచి ముగ్గురు ప్రధానులు మారినా దేశంలో ఆర్థిక పరిస్థితి.. ఇంధన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News